ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో మూడు నెలల కిందట టీ హబ్ పేరిట వ్యాధి నిర్ధరణ పరీక్షల కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 57 రకాల రక్త, మూత్ర నమూనాలకు పరీక్షలు చేసేలా అధునాతన యంత్రాలను నెలకొల్పారు. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని పేదలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వేలల్లో పరీక్షలు చేసుకోలేని వారి కోసం ఉచితంగా పరీక్షలు చేయడమే ఈ కేంద్రం ముఖ్యోద్దేశం. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని ఐదు పట్టణ పీహెచ్‌సీల నుంచి వచ్చిన నమూనాలకు మాత్రమే ఇక్కడ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యశాఖలో పనిచేసే కొంతమంది ఉన్నతాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ప్రైవేటు నర్సింగ్‌హోంలలో పనిచేసే సిబ్బంది టీ హబ్ సేవలను నీరుగార్చేయత్నం చేస్తున్నారు.
గాడి తప్పిన ఉచిత సేవలు
ఇక్కడ పరీక్షలు చేయాలంటే ఏదో ఒక పీహెచ్‌సీ నుంచి గానీ, అర్బన్‌హెల్త్ సెంటర్ నుంచి నమూనాలు రావాలి. అక్కడ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాల ఫలితాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి టీ-హబ్ నుంచి వచ్చిన ప్రత్యేక వాహనంలో వారిచ్చిన డబ్బాల్లోనే పెట్టి చేరవేయాలి. మారుమూల పీహెచ్‌సీల్లో అంతర్జాల సౌకర్యం లేదనే వెసులుబాటును సాకుగా తీసుకుని టీ-హబ్ నిర్వాహకులే నేరుగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆయా పీహెచ్‌సీల నుంచి నమూనాలు సేకరించినట్లుగా నివేదికలు రూపొందించి పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కుటుంబీకులకు సంబంధించిన రక్త నమూనాలను టీ-హబ్ కేంద్రానికి నేరుగా పంపించి పరీక్షలు చేయించడం ఆరోపణలకు బలాన్నిచ్చింది.
పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన నమూనాలను మాత్రమే టీ హబ్ సిబ్బంది తీసుకోవాలి. వాటికే పరీక్షలు నిర్వహించాలి. కానీ ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులతో టీ హబ్ సిబ్బంది కుమ్మక్కై రోగుల నుంచి పరీక్షల కోసం సేకరించిన సొమ్మును దండుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. -రూపేష్, సామాజిక కార్యకర్త
ఒత్తిడి మేరకే