పంచాయతీరాజ్‌లో డిప్యూటేషన్ల పర్వం... ప్రజలకు కష్టం - ఆదిలాబాద్ ఇంజినీరింగ్ డిప్యూటేషన్లు
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో డిప్యూటేషన్ల పర్వం కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజనతో స్వరూపాన్ని మార్చుకున్న ఈ శాఖలో దాదాపుగా నాలుగేళ్ల నుంచి బదిలీలు జరగడంలేదు. ఫలితంగా కొంతమంది హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పైరవీలు చేసుకొని డిప్యూటేషన్లపై వెళ్తుండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పట్టుతప్పుతోంది.
adilabad
By
Published : Sep 12, 2021, 4:01 PM IST
జిల్లాల పునిర్వభజన తరువాత పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో సమూల మార్పువచ్చింది. అంతకుముందు జిల్లా స్థాయిలో ఉండే సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) పోస్టును ప్రభుత్వం రీజినల్ ఆఫీసర్ పంచాయతీరాజ్గా (ఆర్‌వోపీఆర్) మార్చింది. అలాగే డివిజన్ పరిధిలో ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) పోస్టును జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్‌గా (డీపీఆర్‌ఈ) మార్చింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ డివిజన్లతో కూడిన రీజియన్ పరిధిలో మొత్తం 21 మంది డిప్యూటీ ఇంజినీర్లలో 11 మందిని మినహాయిస్తే మిగిలిన 10 మంది పోస్టింగ్ ఉన్న చోట కాకుండా తమకు అనుకూలమైన చోట డిప్యూటేషన్లపై పనిచేస్తున్నారు. వేతనం మాత్రం పోస్టింగ్ ఉన్న చోటనే తీసుకోవడం గమనార్హం.
ఇన్‌ఛార్జీ ఎస్‌ఈదీ డిప్యూటేసనే!
పంచాయతీరాజ్ రీజియన్ అధికారిగా జాదవ్ వెంకట్‌రావు కొనసాగుతున్నారు. వాస్తవంగా ఆయన ఆసిఫాబాద్ డివిజన్ డీపీఆర్‌ఈ పోస్టింగ్. ఆదిలాబాద్‌లోని రీజియన్ అధికారిగా పనిచేసిన రమేశ్ 2020 అక్టోబర్‌లో పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా ఎవరినీ నియమించకపోవడంతో జాదవ్ వెంకట్‌రావును ఇన్‌ఛార్జీగా నియమించింది. ఖాళీ ఏర్పడిన ఆసిఫాబాద్ డీపీఆర్‌గా కాగజ్‌నగర్ డీఈ రామోహన్‌రావుకు అదనపు బాధ్యలను అప్పగించింది. అంటే ఇప్పుడు రామోహన్‌రావు అటు ఆసిఫాబాద్ డీపీఆర్‌ఈగా ఇటు కాగజ్‌నగర్ డీఈఈగా పనిచేస్తుండంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పట్టుతప్పుతోంది.
డిప్యూటేషన్లతో నష్టమేంటి?
డివిజన్ స్థాయిలో డీఈఈ పోస్టు అత్యంత కీలకమైనది. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించే కోట్లాది రూపాయల నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు పైస్థాయిలోని ఈఈల మధ్య డీఈఈల పాత్ర అత్యంత కీలకమైనది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పంచాయతీరాజ్ రోడ్లు వైశాల్యం దాదాపుగా 9 వేల కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు అంచనా. నిర్మల్ జిల్లాను మినహాయిస్తే ఏజెన్సీ ప్రాంతంతో మమేకైన ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలో సరైన రవాణా సౌకర్యంలేదు. అవసరాలరీత్యా ప్రతిపాదనలు తయారుచేయాలన్నా, మంజూరైన నిధులతో పనుల నిర్వహణ పర్యవేక్షణ చేయాలంటే డీఈఈల పాత్రనే ప్రామాణికం. కానీ డిప్యూటేషన్ల కారణంగా క్షేత్రస్థాయిలో జరిగే అధికారిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడి మారుమూల ప్రాంతాలకు రవాణాసౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలకు సైతం నోచుకోని పరిస్థితి ఏర్పడుతోంది.
రూ.16కోట్ల పనులకు అవరోధం
మాంగ్లి రోడ్డు దుస్థితి
ఆదిలాబాద్ నుంచి ఖండాల వరకు 24 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం పీఎంజీఎస్‌వై పథకం కింద మంజూరైన రూ.16 కోట్ల పనులు ఇంకా ఒప్పంద ప్రక్రియ దాటడంలేదు.
వాన్‌వట్ నుంచి మంగ్లీవరకు ఐటీడీతో అనుసంధానమైన మరో పీఆర్ రోడ్డు ప్రతిపాదనలకు నోచుకోవడంలేదు. అంతా ఆదివాసీ గిరిజనులే కావడంతో వారి గోడు బాహ్యప్రపంచానికి తెలిసిరావడంలేదు.
ఉట్నూర్ మండలం ఉమ్రి-ఏందా- శ్యాంపూర్ వరకు దాదాపుగా మరో 20 కిలోమీటర్లతో వేయాల్సిన రోడ్డు పనులు జరగడంలేదు.
ఆదివాసీల ఆరాధ్యదైవం కొలువై ఉన్న కేస్లాపూర్ నుంచి సిరికొండ, ముత్నూర్ నుంచి గిన్నెర వరకు రోడ్డును పట్టించుకున్న నాథుడేలేడు.
ఇవి కొన్ని ఉదాహారణలు మాత్రమే. డీఈఈలు స్థానికంగా లేకపోవడంతో ప్రతి పల్లెతో అనుసంధానమై ఉండే పీఆర్ రోడ్లు అధ్వానంగా తయారై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డీఈఈలు డిప్యూటేషన్లపై వెళ్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
జిల్లాలో డిప్యూటేషన్లపై కొనసాగుతున్న డీఈఈల వివరాలు