కరోనా రెండో దశ ఉద్ధృతమవుతున్న తరుణంలో.. అనేక మంది దాని బారినపడి బాధితులుగా మారుతున్నారు. అయితే జాగ్రత్తలు పాటిస్తూ, మనోధైర్యంతో ఎంతో మంది ఎదుర్కొని విజయం సాధిస్తున్నారు. మహమ్మారి కట్టడికి పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాలా మంది అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది బాధితులయ్యారు. దిగ్విజయంగా పోరాడి, కోలుకొని తిరిగి విధుల్లోకి చేరుతున్నారు. భయపడాల్సిన పనిలేదని, స్వీయ నిర్బంధంలో ఉండి, జాగ్రత్తలు తీసుకుంటూ, ఆత్మస్థైర్యంతో.. కోలుకోవచ్చని ఇటీవలే కోలుకున్న పలువురు అధికారులు పేర్కొంటున్నారు. వారి మాటల్లోనే..
వైద్యుల సూచనలతో..
కరోనా కట్టడిలో నిరంతరం కృషి చేస్తున్నాం. నాకు లక్షణాలు కనిపించడంతో పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకున్నా.. పాజిటివ్‌గా తేలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంతో పాటు వైద్యుల సూచనలతో మందులు వాడాను. పూర్తిగా కోలుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వహిస్తున్నా. వైరస్ బారినపడిన వారెవరూ బయటకు రాకూడదు. విధిగా నిబంధనలు పాటించాలి.
-భరత్ సుమన్, ఎస్‌ఐ నేరడిగొండ
సానుకూల దృక్పథంతో..
ఇటీవలే కరోనాకు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. నిర్ధారణ అయింది. దీనిపై ఆందోళన పడకుండా సానుకూలంగా ఉన్నాను. రోజూ తగిన వ్యాయామం చేయడం, కషాయం తీసుకోవడం, ఆవిరి పట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకున్నాను. కరోనా సోకిన వారు మొదట ఆందోళన చెందవద్ధు దిగ్విజయంగా కోలుకోవచ్ఛు లక్షణాలు ఏమాత్రం కనిపించినా ఇతరులకు దూరంగా ఉండాలి.