తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల టెట్‌, డీఎస్సీకి అర్హత కోల్పోతామని ఆందోళన - ttc latest news

రాష్ట్రంలో పాతజిల్లాల్లోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో డీఎడ్‌ రెండో ఏడాది చదువుతున్న ఛాత్రోపాధ్యాయులకు ఇప్పటికింకా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించనున్న టెట్‌, డీఎస్సీ పరీక్షలకు అవకాశం చేజారిపోతుందనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

deit exams
deit exams

By

Published : Mar 20, 2022, 7:58 PM IST

పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల టెట్‌, డీఎస్సీకి అర్హత కోల్పోతామని ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైన డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ‍(D.ED) బ్యాచ్‌... అదే ఏడాది నవంబర్‌లో నిర్వహించే పరీక్షలతో... మొదటి సంవత్సరం శిక్షణ పూర్తికావాల్సి ఉంది. కరోనా రెండోదశ ఉద్ధృతితో.. తొలిఏడాది పరీక్షలు నిర్వహించకుండానే పాఠశాల విద్యాశాఖ శిక్షణ కాలాన్ని ఈ జనవరి వరకు పొడగించింది. అభ్యర్థులను రెండోఏడాది శిక్షణకు ప్రమోట్‌ చేసింది.

పరీక్షల ప్రస్తావన లేదు

జనవరి 6న ప్రారంభమైన శిక్షణకాలం వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు కొనసాగనుంది. ఈ నెల లేదా వచ్చే నెలలోనైనా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహిస్తే... అభ్యర్థులకు కొంత కలిసొచ్చేది. కానీ ఫిబ్రవరిలో రెండోసంవత్సరం క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ... పరీక్షల ప్రస్తావన చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

వాటికి అర్హత కోల్పోయే పరిస్థితి

నిబంధనల ప్రకారం ఏ విద్యాసంస్థల్లోనైనా నిర్ణీత క్యాలెండర్‌ ప్రకారం... తరగతుల బోధన, పరీక్షల నిర్వహణ మిళితమై ఉంటుంది. కానీ కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో డీఎడ్‌ చదువుతున్న దాదాపు 10 వేలమంది ఛాత్రోపాధ్యాయుల శిక్షణ కాలాన్ని తారుమారు చేసింది. 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైన డీఎడ్‌ శిక్షణాకాలం నిర్ణీత కాలవ్యవధి ప్రకారం పరీక్షల నిర్వహణ లేకుండానే పోయింది. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించనున్న టెట్‌, డీఎస్సీలతోపాటు... కొత్తగా డిగ్రీలో ప్రవేశం పొందాలంటే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

వేసవి సెలవులను రద్దుచేసి అయినా...

డీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు బీఎడ్​ శిక్షణ తీసుకోవాలంటే తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ప్రవేశాలు అక్టోబర్‌ నాటికి మూడో విడత ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు రెండో సంవత్సరం డీఎడ్‌ శిక్షణకాలం డిసెంబర్‌ వరకు ఉండడంతో డిగ్రీ ప్రవేశాలు కోల్పోతే ఏడాది వెనకబడినట్లవుతుంది. అందుకే వేసవి సెలవులను రద్దుచేసి అయినా... పరీక్షలు నిర్వహిస్తే... డిగ్రీ ప్రవేశాలకు అనుకూలంగా మారుతుంది. టెట్‌, డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని ఛాత్రోపాధ్యాయుల అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి :ఈటల రాజేందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details