ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పదవి విరమణ పొందిన పింఛనుదారులకు ప్రతినెల ఒకటో తారీఖునే తమ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు, పింఛను డబ్బులు జమ అవుతుంటాయి. ఈ నెలలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు కాదు కదా.. 8వ తారీఖు వచ్చినా వారి ఖాతాల్లో వేతనం, పింఛను జమకాలేదు. దీనికి తోడు కరోనా సమయంలో 3 నెలల పాటు వేతనంలో కోత విధించిన డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బతుకమ్మ, దసరా పండగలు ఉండటం వల్ల బకాయిలతో పాటు నెలవారీ వేతనం వస్తుందని అంతా సంబురపడుతుండగా.. ఆ సంతోషం అప్పుడే మాయమైంది.
బిల్లులు ఆమోదం పొందినా....
వేతనాల కోసం అటు కార్యాలయాలు, ఇటు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా... ఫలితం లేకుండా పోతోంది. ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే బిల్లులు ఆమోదం పొందినట్లు చూపుతున్నా.. డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కావాల్సి ఉందని అంతర్జాలంలో కనిపిస్తోంది. ఈ తరుణంలో కోత విధించిన వేతన బకాయిల మాట దేవుడెరుగు... నెలవారీ వేతనం కూడా రాకపోవటం వల్ల నానా అవస్థలు పడుతున్నట్లు పింఛనుదారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు.