Adilabad Central Library: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా అర్ధదశాబ్దపు చరిత్ర కలిగిన ఏకైక కేంద్ర గ్రంథాలయం ఇది. రాష్ట్రంలోని ఒకేసారి 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి... ఈ గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. అది ఎంతగా అంటే వచ్చిన వారికి సరిపడా కుర్చీలు లేనంతగా. రోజుకు ఇక్కడికి 300 మందికి తగ్గకుండా యువతీ, యువకులు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నా అవి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి లేకపోవడంతో... సొంతంగా అవసరమైన పుస్తకాలను వెంట తెచ్చుకుంటున్నారు. వేసవి కావడంతో ఏసీలు, కూలర్లు పనిచేయక ఉక్కపోతతో పఠనంపై సరైన దృష్టిసారించలేని పరిస్థితి ఉంది. వైఫై లేని కారణంగా కంప్యూటర్లు మూలన పడి ఉంటున్నాయి. కోరిన పుస్తకాలు తెప్పించడంలేదని, కుర్చీలు తామే తెచ్చుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.