తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెల్లో ప్రగతి... పట్టణాల్లో అదోగతి - palle pragathi

పల్లె ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిన తర్వాత గ్రామాలు అభివృద్ధి మార్గాన పయనిస్తుండగా పురపాలికల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. గ్రామాల్లో డంపింగ్​ యార్డులు పూర్తి కావొస్తున్నా... పురపాలికల్లో మౌలిక వసతుల నిర్మాణాలు జరగడం లేదు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడం, వివాదాలతో చెత్త నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

no development works at muncipalities in joint adilabad district
పల్లెల్లో ప్రగతి... పట్టణాల్లో అధోగతి

By

Published : Jul 29, 2020, 11:56 AM IST

పల్లె ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిన తర్వాత గ్రామసీమలు అభివృద్ధి పథంలో పయనిస్తుండగా పురపాలికలు మాత్రం కనీస సదుపాయాలు కరవై కునారిల్లుతున్నాయి. పంచాయతీలతో పోలిస్తే పన్నులు, ఇతర సెస్సులతో స్వయం సమృద్ధికి అవకాశం ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులకు అవకాశం ఉన్నా చాలా వరకు పురపాలికల్లో మౌలిక వసతుల ఏర్పాటు జరగడం లేదు. ప్రభుత్వ స్థలం లేకపోవడం, వివాదాలతో చెత్త నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పురపాలికల వారీగా పరిస్థితి ఇది..

  • మంచిర్యాల పురపాలిక కోసం గతంలో వేంపల్లి వద్ద 22 ఎకరాలు కేటాయించినా కోర్టు కేసుతో నిలిచిపోయింది. ప్రస్తుతం ఎక్కడ స్థలం ఉంటే అక్కడే చెత్త వేస్తున్నారు.
  • ఆదిలాబాద్‌ పాత పురపాలిక కావడంతో డంపింగ్‌ యార్డుల ఏర్పాటు జరిగింది.
  • నిర్మల్‌లో డంపింగ్‌ యార్డు నిర్మాణం పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. రోజు సేకరించిన చెత్తను శివార్లలో గుర్తించిన ఖాళీ స్థలంలో వేస్తున్నారు.
  • ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ శివార్లలో 4 ఎకరాల్లో ప్రతిపాదించినా కార్యరూపం దాల్చలేదు
  • లక్షెట్టిపేట పురపాలికను 4 గ్రామాలను విలీనం చేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డంపింగ్‌ యార్డు కోసం పలు స్థలాలను పరిశీలించినా అవి కార్యరూపం దాల్చలేదు. చెత్త వేరు చేయడానికి అవకాశం లేదు.
  • చెన్నూరు బల్దియాలో బుద్దారం వెళ్లే దారిలో స్థలం గుర్తించినప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదు. డంపింగ్‌ యార్డుకు వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
  • మందమర్రి పురపాలికలో చెత్త వేసేందుకు వీలుగా చతులాపూర్‌ వద్ద 2 ఎకరాల్లో నిర్మాణం చేపట్టినప్పటికీ రహదారి విషయంలో అటవీశాఖతో తలెత్తిన వివాదం కారణంగా నిలిచి పోయింది. ప్రస్తుతం ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే చెత్త వేయాల్సి వస్తోంది.
  • క్యాతనపల్లిలో 2వ వార్డులో ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలనీ వాసులు అడ్డుకున్నారు.
  • నస్పూరు స్థలాన్ని పరిశీలించినప్పటికీ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు.
  • కాగజ్‌నగర్‌లోని కోసిని, సర్‌సిల్క్‌ ప్రాంతాల్లో గతంలోనే రెండు 5 ఎకరాల చొప్పున కేటాయించారు. ప్రత్యేకంగా నిర్మాణం జరగకున్నా ఖాళీ స్థలంలో చెత్త వేస్తున్నారు.

పురపాలికల జనాభా, రోజువారీ సేకరించే చెత్త(సుమారు) వివరాలు ఇలా...

పురపాలిక జనాభా

సేకరించాల్సిన చెత్త

(మెట్రిక్​ టన్నుల్లో)

ఆదిలాబాద్​ 1,52,432 65
నిర్మల్​ 1,30,236 60
మంచిర్యాల 1,10,000 40
లక్షెట్టిపేట 21,691 06
చెన్నూరు 23,579 9.5
నస్పూరు 76,641 1.5
క్యాతనపల్లి 34,819 6.73
బెల్లంపల్లి 56,396 20
మందమర్రి 53,214 19
ఖానాపూర్​ 20,135 02
కాగజ్​నగర్​ 59,734 25
భైంసా 55,000 24

పల్లెలో అద్భుతం

ఇక్కడ కనిపిస్తున్నది లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో చెత్త నుంచి సంపద సృష్టించేందుకు నిర్మించిన కేంద్రం. సేకరించిన పొడి చెత్తను వేరు చేసి ఇక్కడ కనిపిస్తున్న విభిన్నమైన గదుల్లో వేస్తారు. ప్లాస్టిక్‌, గాజు సీసాలు, పగిలిన పెంకులు, పాలిథీన్‌ కవర్లు, కాగితాలు ఒక్కో రకం వాటిని ఒక్కో గదిలో వేస్తారు. నిండగానే వాటిని అమ్మి పంచాయతీకి ఆదాయం సమకూర్చుకుంటారు. సేకరించిన తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చి తయారైన ఎరువును రైతాంగానికి అమ్మడానికి వీలుగా ఏర్పాట్లు జరిగాయి.

పురంలో దారుణం

ఇది లక్షెట్టిపేట పురపాలికలో గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్ఢు పంచాయతీగా ఉన్న సమయంలో దీనిని ఏర్పాటు చేశారు. విలీన గ్రామాల్లోని చాలా కాలనీలకు ఇదే దిక్కు. పురపాలిక ఏర్పాటు తర్వాత జనాభాకు అనుగుణంగా డంపింగ్‌ యార్డు నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఆ ప్రాంతం అంతా చెత్తతో కనిపిస్తోంది.

ఇవీ చూడండి: శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణంపైనా సర్కారు దృష్టి

ABOUT THE AUTHOR

...view details