ఆదిలాబాద్ మున్సిపాలిటీ... పట్టణ విస్తీర్ణంలో భాగంగా 49 వార్డులకు చేరింది. జనాభా 1.55 లక్షల పైచిలుకుగా చేరినప్పటికీ సుందరీకరణ మాత్రం నామమాత్రంగానే ఉంది. పట్టణ పరిధిలోని ప్రధాన కేంద్రాలైన అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, నేతాజీచౌక్, శివాజీచౌక్, వివేకానందచౌక్, ఎన్టీఆర్‌చౌక్, పంజాబ్‌చౌక్, కలెక్టరేట్ చౌక్, ఠాకూర్‌హోటల్ వద్ద కనీసం సెంట్రల్ లైటింగ్ విధానం సక్రమంగా లేదు. ఫౌంటెయినింగ్, పచ్చగడ్డి, విద్యుత్ దీపాలతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన కూడళ్లు... కేవలం చిరువ్యాపారులకు అడ్డాలుగా మారిపోతున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా సుందరీకరణ కనిపించకపోవడం వల్ల పట్టణమంతా బోసిపోయినట్లుగా కనిపిస్తోంది.
నిధులున్నా.. కానరాని అభివృద్ధి
మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కోసం ప్రభుత్వం 2017లో రూ. 27 కోట్లు, 2018లో మరో రూ. 28 కోట్లను విడుదల చేసింది. పట్టణ శివారు ప్రాంతమైన మావల మొదలుకొని చాందా(టి) వరకు పాతజాతీయ రహదారి వెడల్పు, విద్యుదీకరణకోసం మరో రూ. 44 కోట్లను మంజూరు చేసింది. కానీ మున్సిపాలిటీ, ఆర్అండ్బీ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పనులు ముందుకు సాగడంలేదు.