తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 8:39 AM IST

ETV Bharat / state

కరోనా కోరల్లో పసిప్రాణం.. కాపాడుకునేందుకు తల్లిదండ్రుల ఆరాటం

కరోనా మహమ్మారి.. కన్నవాళ్లకు బిడ్డల్ని దూరం చేస్తోంది. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన ఓ చిన్నిప్రాణం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతోంది. నిన్న మొన్నటి వరకు తన బోసినవ్వుతో ఇంట్లో సందడి చేసిన ఆ బాబు.. తిరిగొస్తాడో రాడోనని ఆ కన్నతల్లి గుండె కలవరపడుతోంది. కరోనా సోకిన తొమ్మిది నెలల పసికందు చికిత్స కోసం ఉన్నదంతా అమ్మేశారు ఆ తల్లిదండ్రులు. తమ బాబు ప్రాణం నిలవాలంటే చికిత్సకు ఇంకా డబ్బు కావాలని డాక్టర్లు చెప్పగా.. బుజ్జి ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ఆరాటపడుతున్నారు. ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

baby boy affected with corona, baby bou tested positive, adilabad corona news
చిన్నారికి కరోనా, కరోనా కోరల్లో చిన్నారి, ఆదిలాబాద్ కరోనా న్యూస్

నిన్న మొన్నటి వరకు బోసినవ్వుతో సందడి చేసిన ఆ బాబు కరోనా మహమ్మారి సోకి అమ్మ ఒడికి దూరమయ్యాడు. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ చిన్నారని బతికించుకోడానికి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన సంతోశ్-పౌర్ణమి దంపతుల తొమ్మిది నెలల బాబు కరోనాతో హైదరాబాద్​లోని కిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భీంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే సంతోశ్​ ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత అతని భార్యకూ వైరస్ సోకింది.

వీళ్లిద్దరు కోలుకుంటున్న తరుణంలో వారి గారాలపట్టి శ్రీయశ్​ మహమ్మారి బారిన పడ్డాడు. తొలుత బాబును ఆదిలాబాద్​ రిమ్స్​లో చేర్పించారు. పరిస్థితి విషమించగా.. హైదరాబాద్​కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రోజుకు రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోందని.. తమ చిన్నారి ప్రాణం కాపాడటానికి సాయం చేయాలని ఆ దంపతులు కోరుతున్నారు. బాబు ప్రాణం రక్షించే దాత కోసం ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details