Nagoba jatara in Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కొండల్లో నాగోబా జాతరకు రంగం సిద్ధమైంది. మెస్రం వంశస్తులు తరతరాలుగా భక్తి, శ్రద్ధలతో పాటిస్తున్న ఆచార వ్యవహారాలు నాగోబా వేడుకలకు తలమానికంగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ రాత్రి నాగదేవతకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉండే ఆదివాసి మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా దేవత వద్ద కలుసుకోవాలనేది అనాధిగా వస్తున్న ఆచారం. జాతరకు వీరంతా ఎడ్లబండ్లపై వస్తారు.
Nagoba jatara 2023 : నాగోబా వ్రతం ఆచరిస్తున్న మెస్రం వంశీయులు కాలినడకన 15 రోజుల పాటు ప్రయాణించి, గోదావరి నది నుంచి మట్టి కుండల్లో నీళ్లు తెస్తారు. ఆ నీటిని పవిత్ర గంగాజలంగా భావిస్తారు. ప్రయాణ బడలిక తీరేందుకు కేస్లాపూర్ సమీపంలో మర్రిచెట్టు కింద సేదతీరుతారు. తుడుంమోతలు, సన్నాయి వాయిద్యాల మోగిస్తూ.. అర్ధరాత్రి నాగోబా దేవతను అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది.