తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల సంప్రదాయం... నాగోబా జాతర వైభోగం - nagoba jatara latest news

రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన కేస్లాపూర్‌ నాగోబా వేడుకల సన్నద్ధత ప్రక్రియ ఊపందుకుంది. ఫిబ్రవరి 11న జరిగే మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశస్థులు పాదయాత్రగా బయలుదేరారు. ఆ యాత్ర విశేషాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

nagoba festival importance full story
nagoba festival importance full story

By

Published : Jan 28, 2021, 8:40 AM IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాద్యదైవం నాగోబా దేవత కొలువై ఉంది. ఏటా పుష్యమాసంలో ఇక్కడ జాతరను నిర్వహించడం అనాదిగా వస్తోంది. జాతర నిర్వహణలో మేస్రం వంశస్థులది ప్రత్యేక పాత్ర. పూజల దగ్గర నుంచి జాతర ముగింపు వరకు వారే ముందుండి అంతా చూసుకుంటారు. జాతర ప్రారంభానికి ముందే అందుకు సంబంధించిన పనులను పవిత్రంగా, నియమనిష్ఠలతో కొనసాగిస్తారు. ఫిబ్రవరి 11న మహాపూజతో జాతరకు శ్రీకారం చుడతారు. ఆ మహాపూజలో పవిత్ర గంగజలాన్ని తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేయడం ప్రధాన ఘట్టంగా భావిస్తారు.

అతిథులకు ఆహ్వానం...

ఆ గంగాజలం తీసుకొచ్చేందుకు 41 రోజుల దీక్ష చేపట్టారు మేస్రం వంశస్థులు. ఈనెల 21న నాగోబా ఆలయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. పాదరక్షలు ధరించకుండా ఊరూర ఆగుతూ... అచ్చం నాగపాము మాదిరి నడక సాగిస్తున్నారు. ప్రస్తుతం వారి యాత్ర కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం గౌరి గ్రామానికి చేరింది. అక్కడ బసచేసిన తాము ఈనెల 30న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చేరుకుని అక్కడి గోదావరి నది నుంచి గంగజలం తీసుకొస్తామని మెస్రం పెద్దలు చెబుతున్నారు. యాత్రలో భాగంగా ఆహ్వానితుల ఊర్లకు చేరి వారి ఆతిథ్యం స్వీకరించి జాతర రావాలని వారిని కోరుతున్నట్లు వివరించారు.

గ్రామాల్లో అతిథ్యం...

పాదయాత్రగా వెళ్లి బసచేసిన చోటల్లా ఆయా గ్రామాల అతిథ్యం స్వీకరిస్తున్నారు. ఆయా గ్రామాల ఆదివాసీలు వీరికి ఘనస్వాగతం పలుకుతున్నారు. గంగాజలం తెచ్చేందుకు తీసుకెళ్లే పాత్రలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజల అనంతరం సహపంక్తి భోజనాలు చేసిన మెస్రం కులస్థులు గంగాజలం కోసం నడకను ముందుకుసాగిస్తున్నారు. విశేషమేమిటంటే ఎంతో పవిత్రంగా కొనసాగుతున్న ఈ యాత్రలో చిన్నారులు భాగస్వాములవుతున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడంలో విహారయాత్రగా భావిస్తున్నట్లు యాత్రలో పాల్గొంటున్న బాలలు సంతోషంగా చెబుతున్నారు.

ఆడపడుచులకు కానుకలు...

యాత్రలో ముందుకు సాగుతున్న మెస్రం వంశస్థులు అతిథ్యం ఇచ్చిన కుటుంబాల ఆడపడుచులకు కానుకలు ఇవ్వడం కూడా సంప్రదాయంలో భాగమే. యాత్రలో మొత్తం తొమ్మిది గ్రామాల్లో బస చేస్తున్న వీరంతా తిరుగుపయనం అయ్యేటపుడు ఆడపడుచులకు తోచిన కానుకలు ఇస్తూ ముందుకు కదులుతున్నారు.

జాతీయ వేడుకగా జరుపుకొనే నాగోబా జాతర ప్రారంభమే కాదు... సన్నద్ధత పనులు కూడా పవిత్రంగా, ఎంతో నిష్ఠతో నిర్వహిస్తారనడాకి తరాలుగా సాగిస్తున్న కాలినడక నిదర్శనం.

ఇదీ చూడండి:ఇప్పచెట్టే దైవం.. తునికి పండ్లే నైవేద్యం!

ABOUT THE AUTHOR

...view details