Tigers Wandering in Adilabad District: అసలే అరణ్యం. అంతంత మాత్రంగానే జనసంచారం. చెట్టూపుట్ట తిరిగితే కానీ, పూట గడవని జీవనం. ఈ పరిస్థితుల్లో ఊహించనిరీతిలో పులి విరుచుకుపడితే ఇక అంతే సంగతులు. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి భయానక పరిస్థితులే నెలకొన్నాయి. కుమురంభీం జిల్లా వాంకిడి పరిధిలోని ఖానాపూర్‌లో మూడ్రోజుల క్రితం భీము అనే రైతుని పులి పొట్టనబెట్టుకుంది. ఇప్పటి వరకు అడవుల్లో మేతకు వెళ్లిన పశువులపై మాత్రమే దాడులు చేసిన వ్యాఘ్రాలు, మనుషులను మట్టుబెడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండేళ్లలో పులుల దాడిలో మరణించిన వారి సంఖ్య తాజా ఘటనతో మూడుకు చేరింది.
గత నెలరోజులుగా ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాల్లో తరచుగా సంచరిస్తున్న పులులు.. పశువులపై దాడులు చేస్తున్నాయి. గతంలో తాడోబా అభయారణ్యం నుంచి వచ్చిన “ఏ2” పులి జనావాసాలకు దగ్గరగా వచ్చి భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరిని చంపేసిన ఈ పులి ఒకేరోజు నాలుగైదు పశువులను వేటాడేది. అధికారులు దానిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బెజ్జూరు మండలంలోని చీపురుదేవర అటవీ ప్రాంతంలో జనవరి 2021లో బోను, ఎరను సైతం అమర్చినా పులి పట్టుబడలేదు. ఆచూకీ లభించకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లిపోయిందని అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 20 పులుల వరకు సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు జతకట్టే కాలం కాగా, ఇదే సమయంలో పత్తి ఏరడానికి రైతులు, కూలీలు పంటపొలాలకు వెళ్తుంటారు. ఈ క్రమలోనే గత మంగళవారం ఖానాపూర్ గ్రామంలో పులిదాడిలో రైతు భీము ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. వాంకిడిలో రైతు ఘటన తర్వాత అక్కడి నుంచి పులి కాగజ్‌నగర్ వైపు వచ్చింది.