MLA Jogu Ramanna Interview : జోగు రామన్న... ప్రజలకు సుపరిచితమైన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక... మంత్రిగా పనిచేసిన అనుభవం... తాజాగా పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం ఆయననే వరించింది. తనకు మరింత బాధ్యత పెరిగిందని జోగు రామన్న అంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ... పదవికి వన్నెతెస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.
- ఈటీవీ భారత్ : జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా జోడు పదవులు నిర్వహించడం ఇబ్బందికరమైన అంశం కాదా.? అధ్యక్షుడిగా పార్టీకీ, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు.?
జోగు రామన్న: ఒక్కరికే రెండు పదవులు ఇవ్వాలనేది మా అధినేత కేసీఆర్ ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయం. పార్టీ శ్రేణులు, ప్రజలను ఏకతాటిపై సమర్థవంతంగా నడిపించడానికి అవకాశం లభిస్తుంది. మరింత మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లో అధికార బాధ్యతలు కేంద్రీకృతం చేయడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే వెసలుబాటు కలుగుతుంది.
- ఈటీవీ భారత్ : మీ మద్దతుతోనే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు మీ పార్టీలోని కొంతమంది ప్రయత్నించారు కదా. ఇప్పుడు మీరే నియమితులు కావడంతో అధ్యక్ష పీఠంపై ఆశలు పెంచుకున్నవారిలో అసంతృప్తి పెరగదంటారా.?
జోగు: కొంత అసంతృప్తి ఉంటుది. ఎందుకుండదు. పదవులు ఆశించడం తప్పుకాదు. కానీ పార్టీ నిర్ణయమే అంతిమం కదా. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో నాలో గర్వమేమీ రాలేదు. రాదు. మునుపటి రామన్ననే. ఎమ్మెల్యేగా కూడా ఏనాడూ అహంభావానికి లోనవలేదు. నిరంతరం ప్రజల్లోనే ఉంటా. కార్యకర్తలతో మంచిచెడులు ఆలోచిస్తా. ఇక ఉద్దేశపూర్వకంగా నన్ను తులనాడాలని భావించేవారిలో ఏం మార్పుతీసుకురాలేం. వాస్తవాలను గమనించాలి. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటే అందరికీ మంచి జరుగుతుంది.
- ఈటీవీ భారత్ : మీరు ఎమ్మెల్యే, మీ పెద్దబ్బాయి పురపాలక సంఘం ఛైర్మన్, మళ్లీ ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులు. అంటే పదవులు మీకే వరిస్తే, పార్టీలో ఉండే క్రియాశీలకంగా ఉండేవారి పరిస్థితి ఏమిటి.? పార్టీ పరంగా తప్పొప్పులు జరిగితే ఎవరిని తప్పుపడతారు.?
జోగు: మీరన్నట్లు ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్‌గా తండ్రీకొడుకలమే ఉన్నాం. కాదనలేం. ఇక అధ్యక్ష పదవి అనేది అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం. ఒక్కటి మాత్రం నిజం. మునుపటికంటే మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నా. ముల్లు ఆకుపై పడినా, ఆకు ముల్లుపై పడినా ఆకుకే నష్టం అన్నట్లు ఉంటుంది. అందుకే ప్రజలతోనే మమేకమవుతాం. మరింత బాధ్యతతోనే కాదు అప్రమత్తంగా ఉంటాం. మున్సిపల్ ఛైర్మన్‌గా మా అబ్బాయికీ అదే చెప్పా. రాగలరోజుల్లో మా పనితీరును మీరే చూస్తారు.
- ఈటీవీ భారత్ : జిల్లా అధ్యక్షులుగా నియమితులైనవారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వరనే ప్రచారం మీ పార్టీలోనే జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందా.?