ఆదిలాబాద్ గ్రామీణ జడ్పీటీసీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కి ముందే వలసలు మొదలయ్యాయి. కరోనాతో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆరె రాజన్న మృతిచెందగా... ఉపఎన్నిక అనివార్యంగా మారింది. తెరాస తన పట్టును నిలుపుకునేందుకు భాజపా తరఫున గట్టిపోటీ ఇచ్చే జడ్పీటీసీ అభ్యర్థి దారట్ల జీవన్‌ను పార్టీలో చేర్చుకుంది. మండలంలోని చాందా టి గ్రామంలో కండువా కప్పి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
'కేంద్రం నిధులిస్తుందంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు'
సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందంటూ భాజపా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. ఆ మాటలు నమ్మవద్దని ప్రజలని కోరారు. ఆదిలాబాద్ గ్రామీణ జడ్పీటీసీ అభ్యర్థి దారట్ల జీవన్‌కు పార్టీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.
భాజపా నేతల తీరును ఎమ్మెల్యే జోగు రామన్న దుయ్యబట్టారు. నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా... కేంద్రం నుంచి వస్తున్నాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. పన్నుల రూపేణా రాష్ట్రం నుంచి చెల్లిస్తున్న నిధులను కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ప్రజాప్రతినిధుల కేసులపై హైకోర్టుల పర్యవేక్షణ అవసరం'