ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రికి.. మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని గతంలోనూ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చినా.. ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికీ సీసీఐను పునరుద్ధరించేందుకు అక్కడ స్థానికంగా అనేక సానుకూల వాతావరణం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం సైతం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ ప్రస్తావన...
1984లో ఆదిలాబాద్ పట్టణంలో రూ.47 కోట్ల వ్యయంతో 772 ఎకరాల్లో సీసీఐ పరిశ్రమ ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా 170 ఎకరాల్లో సీసీఐ టౌన్షిప్ కూడా ఏర్పాటైంది. ఈ ప్లాంట్ ద్వారా మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవి. నిధుల లేమితో దురదృష్టవశాత్తు 1996లో సీసీఐ కార్యకలాపాలు ఆగిపోగా.. 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పూర్తిగా మూసివేశారు. ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా, అప్పటి నుంచి ఈ అంశం పై స్టేటస్ కో నడుస్తోంది. ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉండటం గమనార్హం.