లాక్‌డౌన్ కారణంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇరుక్కుపోయిన వలస జీవులు తమ సొంత ప్రాంతాలకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు వెళ్తుండగా అధికారులు వీరిని ఇక్కడే నిలిపివేశారు.
జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్, బీసీ వసతిగృహం, కస్తూర్బాగాంధీ విద్యాలయం, తాంసి బస్టాండ్, రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణాల్లో ఉన్న నిరాశ్రయుల కేంద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించిన అధికారులు దాతల సాయంతో మూడు పూటలా భోజనం పెడుతున్నారు. తమ కుటుంబ సభ్యులను చూడాలని ఉందని.. సొంత ప్రాంతాలకు పంపించాలని అధికారులను వారు వేడుకుంటున్నారు.
పిల్లలను చూడాలని ఉంది
మా సొంత గ్రామంలో తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాదులో కూలీ పనిచేస్తున్న తాను లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత ఊరికి బయలుదేరే క్రమంలో ఇక్కడ నిలిపివేశారు. ఇద్దరు పిల్లలు చాలా చిన్న వారు. పక్షం రోజుల నుంచి ఇక్కడే ఉండటంతో వారు ఎలా ఉన్నారోననే బెంగగా ఉంది. వారిని చూడాలని ఉంది.