తెలంగాణ

telangana

ETV Bharat / state

గోప్యత వద్దు... పొంచి ఉంది ముప్పు - గోప్యత వద్దు... పొంచి ఉంది ముప్పు

పోలీసులు, వైద్య సిబ్బంది కరోనా పోరులో అలుపెరగని పోరాటం చేస్తుంటే కొందరు దొడ్డిదారిన జిల్లాల సరిహద్దులు దాటుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా సరిహద్దుల్లోని అడ్డదారుల్లో స్వగృహాలకు చేరుకుంటున్నారు. నడక దారుల్లో వచ్చిన వారి వల్ల వైరస్‌ వ్యాప్తి జరిగితే అడ్డుకునేది ఎలా అనేదే ప్రశ్నార్థకంగా మారింది.

Migrant laborers coming from Maharashtra via other routes to the joint Adilabad district
గోప్యత వద్దు... పొంచి ఉంది ముప్పు

By

Published : Apr 22, 2020, 3:17 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కడి వారిని అక్కడి వాళ్లు, అక్కడి వాళ్లను ఇక్కడి వాళ్లు పెళ్లిల్లు చేసుకోవడం వల్ల బంధుత్వాలు పెరిగాయి. దీనివల్ల నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. చాలా మంది జిల్లా వాసులు ఉపాధి, ప్రయివేటు ఉద్యోగాల నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లారు. వీళ్లే కాక ఆయా పనుల నిమిత్తం వలస వెళ్లిన కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. కరోనా కర్ఫ్యూ తేదీని మే 7కి మార్చటం వల్ల అక్కడి వాళ్లు జిల్లాకు కాలినడకన వస్తున్నారు.

నిఘా నీడలో రహదారి మార్గాలు..

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులపై పోలీసు శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. జిల్లా సరిహద్దుల గుండా అత్యవసరం, నిత్యావసర సరకుల వాహనాలు తప్ప వేరే వాటికి అనుమతి కూడా ఇవ్వడం లేదు. రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు.

సమస్య వచ్చిపడిందిక్కడే..

కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల సరిహద్దులోని దహెగాం, బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌టి, కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దు ప్రాంతాలన్నీ మహారాష్ట్రతో కలిసిపోయి ఉంటాయి. ప్రస్తుతం జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట పోలీసు చెక్‌పోస్టులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. దీనివల్ల కొంత మంది మహారాష్ట్ర నుంచి ఈ సరిహద్దుల వద్ద ఉన్న అటవీ, నదులు, పల్లెటూర్ల దారుల గుండా నడక మార్గంలో స్వగ్రామాలకు చేరుకొని రాత్రి వేళల్లో ఇళ్లలోకి వెళ్తున్నారు. గ్రామస్థులకు ఎవరికైనా తెలిసి అధికారులకు సమాచారం ఇస్తే తప్ప విషయం బయటికి రావడం లేదు.

క్వారంటైన్‌ తప్పించుకోవడానికేనా..?

మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చామని తెలిస్తే తమను ఆసుపత్రికి తీసుకెళ్తారు అనే భయంతో ఎంతో మంది తాము మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు చెప్పకుండా దాచిపెడుతున్నారు. ఈ గోప్యత వారితో పాటు వారి కుటుంబ సభ్యులకే కాకుండా ఆ గ్రామస్థులు, ఆ మండల వాసులు, జిల్లా ప్రజలకు ముప్పును తెచ్చిపెట్టనుంది. ఆ రాష్ట్రం నుండి వచ్చిన వారు స్వతహాగా అధికాలకు తెలియజేస్తే హోమ్‌క్వారంటైన్‌ లేదంటే ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలిస్తారు.

ఆలోచిస్తే మేలు..

15 రోజుల పాటు హోంక్వారంటైన్‌ లేదా ఆసునత్రిలోని క్వారంటైన్‌లో ఉండి వ్యాధి లక్షణాలు లేకుంటే ఇంటికి పంపించేస్తారు. దీనికి ఎవరూ ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీసులకు సమాచారం అందించి పరీక్షలు చేయించుకుంటే వారితో పాటు ఇతరులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ABOUT THE AUTHOR

...view details