mid day meals stopped in adilabad ఆదిలాబాద్ జిల్లాలో వంట కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్న భోజనం అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. నెలలుగా రావాల్సిన బకాయి సొమ్ము రాకపోవడం వల్ల వంట కార్మికులు మధ్యాహ్న భోజనాన్ని వండటం లేదు. కొందరు తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి మధ్నాహ్న భోజనం తెస్తున్నా.. మరికొందరు మాత్రం అర్ధాకలితోనే తరగతులు వినాల్సిన దుస్థితి నెలకొంది.
అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం వండుతున్నామని, బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల ఇక తమ వల్ల కావడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు వంటలు మానేస్తున్నట్లు షెడ్లకు తాళాలు వేసి కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలకు దిగారు. కొన్ని బడుల్లో ఉపాధ్యాయులే చొరవ తీసుకుని వంట చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. మద్యాహ్న భోజనం లేకపోవటం విద్యార్థుల హాజరు శాతంపై ప్రభావం చూపుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మరోవైపు బిల్లుల సమస్య ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెబుతున్నారు. 10, 15 రోజుల్లో బిల్లులు విడుదలవుతాయని.. వంట కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించి సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.