Nagoba jatara 2022: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రత్యేక పూజలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవిని మెస్రం వంశస్థులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. జాతరకు కావాల్సిన పవిత్ర జలాలను ఆలయానికి తీసుకొచ్చారు. ఈనెల 21 కాలినడకన పయనమై మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాలి గోదావరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్ర దేవాలయానికి చేరుకున్నారు. పుష్యమాసంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఇవాళ ఉదయం నుంచే ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మెశ్రం వంశీయులు పండించిన వరి ధాన్యంతో దంపుడు బియ్యం, మినప్పప్పుతో తయారుచేసిన నైవేద్యాలను దేవికి సమర్పించారు. అనంతరం సామూహిక భోజనం చేసి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ ప్రాంగణంలో మర్రి చెట్ల వద్దకు ప్రయాణమయ్యారు.
జాతర ప్రత్యేకతలేంటి..
కాలిక చెప్పుల్లేకుండా.. మెస్రం వంశీయులు నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో తరలివెళ్తారు. జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా వెళ్తారు. తమతో పాటు చెట్టూ, పుట్ట, చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరిచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. నియమ, నిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయుల నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు.
మెస్రం వంశీయుల జీవనానికి నిలువుటద్దం...
నాగోబా జాతర మెస్రం వంశీయుల జీవన విధానం.. వారి ఆచార వ్యవహారాలకు ఇదో నిలువుటద్దం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లైనా తరలివస్తారు. కొందరు ఎడ్లబళ్లపై చేరుకుంటారు. ప్రతిఏటా పుష్యమి శుక్లపక్షమి రోజున గంగాజలం కోసం 15 రోజుల పాటు కాలినడక సాగిస్తారు. గోదావరి జలాల సేకరణకు మంచిర్యాల జిల్లా జన్నారం పయనమయ్యారు. అక్కడ పవిత్ర గంగా జలాన్ని కడవల్లో నింపుకొని కేస్లాపూర్‌కు చేరుకుంటారు. పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు.
నాగోబా జాతర కథేంటి?