తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతికి కాదేదీ అనర్హం.. మీసేవల్లోనూ అక్రమం!

అవినీతికి కాదేది అనర్హం అన్నరీతిలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో మీసేవ కేంద్రాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించేందుకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. . అక్రమాలను గుర్తించిన అధికారులు గుడిహత్నూర్‌ మీసేవ కేంద్రాన్ని మూసివేయించారు.

Meeseva centers doing illegal activities in adilabad dist
అక్రమాలకు నిలయంగా మీసేవా కేంద్రాలు

By

Published : Jan 5, 2021, 12:37 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో అక్రమార్కులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించేందుకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులు, జన్మదిన ధ్రువపత్రాలు నకిలీవి తయారు చేస్తున్నారు. రూ.2 వేల నుంచి రూ.3 వేలు తీసుకుని వీటిని చేతిలో పెడుతున్నారు.

నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు..

ఇద్రిస్‌ అనే వ్యక్తికి ఇచ్చిన నకిలీ జన్మదిన ధ్రువపత్రం:

* ఇచ్చోడకు చెందిన ఇద్రీస్‌ అనే యువకుడు 1997 జనవరి ఒకటో తేదీన జన్మించినట్లు లెటర్‌ నంబర్‌ జీ/05/2019/2019 ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 24న జనన ధ్రువ పత్రం జారీ అయింది. ఇప్పుడా యువకుడికి 30ఏళ్ల వయస్సున్నట్లు టీఎస్‌జీజీడీడీ36065698 నెంబరుతో గతంలో పనిచేసిన ఆదిలాబాద్‌ ఆర్డీఓ ధ్రువీకరించినట్లు మీసేవ ముద్రతో పత్రం జారీ అయింది.

కరుణచవాన్‌కు ఇచ్చిన నకిలీ జన్మదిన ధ్రువపత్రం

* నేరడిగొండ మండలానికి చెందిన కరుణచవాన్‌ అనే బాలిక 2001 నవంబర్‌ రెండో తేదీన జన్మించినట్లు లెటర్‌ నంబర్‌ జీ/06/2020/2020 ప్రకారం గతేడాది జనవరి 22న జనన ధ్రువీకరణ పత్రం జారీ అయింది. ఈ యువతికి సైతం 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు టీఎస్‌ జీజీడీడీ 36063742 నెంబరుతో మాజీ తహసీల్దార్‌ సిఫారసు చేయగా అప్పటి ఆర్డీఓ పత్రం జారీ చేశారు.

రేషన్‌కార్డుల కోసం...

* ఆస్మాబాను, సురేఖ అనే మహిళలది మహారాష్ట్ర. అక్కడి వారి చిరునామాను దాచిపెట్టి దళార్లు ఆస్మాబాను ఆదిలాబాద్‌ పట్టణంలోని కోలిపురలో ఉన్నట్లు, సురేఖ రణధివేనగర్‌లో ఉన్నట్లు ఓ బినామీ చిరునామాలతో రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించారు. అయితే ప్రభుత్వం రేషన్‌ కార్డులను జారీ చేయకపోవడంతో వారి పాచిక పారలేదు.

* నేరడిగొండకు చెందిన సురేష్‌ అనే యువకుడు 1997 ఆగస్టు ఆరో తేదీన జన్మించినట్లు లెటర్‌ నంబర్‌ జీ/06/2020/2020 ప్రకారం ఈ ఏడాది జనవరి 23న జనన ధ్రువీకరణ పత్రం జారీ అయింది. గుడిహత్నూర్‌ మీ సేవా కేంద్రం నుంచి జారీ అయిన వాస్తవంగా ఇవేవీ అధికారులు ధ్రువీకరించినవి కావు.

* ప్రభుత్వం వృద్ధులు, వితంతవులు, ఒంటిరి మహిళ, అంగవైకల్యం కలిగిన వారికి పింఛన్లు మంజూరు చేస్తోంది. మధ్యవర్తులు కొంతమందిని వయస్సు పెంచి ఆధార్‌ నమోదుచేయించి పింఛను ఇప్పిస్తామని నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల 55ఏళ్ల వయస్సున్న ఓ రైతు అనారోగ్యంతో కాలం చేశారు. ఆయన పేరిట వ్యవసాయ భూమి సైతం ఉంది. వాస్తవానికి ఆయనకు రైతుబీమా రావాలి. కానీ ఆధార్‌ కార్డులో ఆయన వయస్సు 65 ఉండటంతో రైతుబీమా రాలేదు. పింఛను వస్తుందని ఆయనను బురిడీ కొట్టించి తప్పుగా నమోదు చేశారు.

ప్రభుత్వ పథకాల కోసం మార్చేస్తున్నారు:

* ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే 111 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల జారీలో బినామీ బాగోతం వెలుగుచూసింది. ఇందులో 87 మందికి బినామీ పత్రాలతో పేర్ల్లు తారుమారుతోనే ఒకటికి రెండుసార్లు పెళ్లి సాయం పొందిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారమైతే పర్మినెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌(పీఈసీ) కేంద్రంగా జారీ అయ్యే ఆధార్‌కార్డుల్లో ఒక్కో వ్యక్తికి 11 అంకెలతో ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏ) నెంబర్‌తో కార్డు కేటాయింపు జరుగుతోంది. పేర్లు మార్చుకోవడానికి రెండుసార్లు, లింగబేధం మార్చుకోవడానికి ఒకసారి అవకాశం ఉంటుంది. చిరునామా తప్పుగా ఉంటే ఎన్నిసార్లయినా మార్చుకోవచ్ఛు పుట్టిన తేదీని సరిచేసుకోవడానికి కేవలం ఒకేసారి వెసులుబాటు ఉంటుంది. దానికి కూడా తప్పనిసరిగా ఆర్డీవో, వైద్యుడు, ప్రభుత్వ ఆచార్యుడు, లేదా గిజిటెడ్‌ అధికారుల్లో ఎవరో ఒకరి ధ్రువీకరణ, పాన్‌కార్డు, పదోతరగతి మార్కుల మెమో, డ్రైవింగ్‌ లైసెన్సుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అక్రమాల్లోని 87 పత్రాల్లో దాదాపుగా ఆఫ్‌లైన్లోనే వయసు ఆధారంగానే అక్రమదందా జరినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రధానంగా మహారాష్ట్రీయులకు దళార్లు పింఛన్ల కోసం ఆధార్‌కార్డులు, ఎన్నికల్లో ఓటువేయడం కోసం నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను సృష్టిస్తున్నారు.

* ‘మీ వయసు తక్కువగా ఉండి వృద్ధాప్య పింఛను రావడం లేదా..? ఏం బాధపడొద్ధు వయసు పెంచి ఆధార్‌కార్డు సహా పింఛను ఇప్పిస్తా. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వచ్చేలా చూస్తా. నెలనెలా రేషన్‌ సరకులు అందేలా చేస్తా., కళాశాల ఉపకారవేతనం ఇప్పిస్తా..’ భరోసాతో కూడిన ఈ మాటలు వింటే అవన్నీ ఎవరో రాజకీయనేత చెప్పారనుకుంటాం.. ఇవన్నీ అమాయకులకు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు, దళార్ల హామీలు..

* అధికారులు ఆదిలాబాద్‌, మావల, ఉట్నూరు మీసేవా కేంద్రాల పనితీరు సరిగా లేకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేయగా, అనుమానాస్పద లావాదేవీలున్న గుడిహత్నూర్‌, ఇచ్చోడ మీసేవల కేంద్రాలను రద్దు చేశారు.

లెక్క లేని ఆధార్‌లు :

ఆదిలాబాద్‌ జిల్లా జనాభా దాదాపుగా 7.09 లక్షల పై మాటే. వారిలో ఆధార్‌కార్డులు ఉన్నవారెందరనేది సరైన లెక్కలేదు. కానీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలోని లెక్క ప్రకారం 2,02740 మందికి జాబ్‌కార్డులుండగా వీరిలో 850మంది ఆధార్‌ వివరాలు సరిపోలడం లేదు. ఇవి నిజమైనవేనా కాదా అని అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉపాధిహామీ కూలీలకు గ్రామీణాభివృద్ధిశాఖ డబ్బులను చెల్లించలేదు.

ఇదీ చూడండి:కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details