ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 28కోట్ల 30లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణలో... నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా 9.5కి.మీ వైశాల్యంతో చేపట్టిన డ్రైనేజీలు, నాలుగు కిలోమీటర్ల వైశాల్యంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం, మరో ఆరున్నర కి.మీ వైశాల్యంతో కొనసాగుతున్న బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు 1.8 కి.మీ వైశాల్యంతో చేపట్టిన డివైడర్ల నిర్మాణంలో నాణ్యత కనిపించడంలేదు. టెండర్ ఒప్పందంలో 2020 ఏప్రిల్ నాలుగో తేదీలోగా పనులు పూర్తిచేయాల్సి ఉండగా... ఇప్పటికీ పూర్తికాలేదు.
కొరవడిన పర్యవేక్షణ..
ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రగతి పనులపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా గుత్తేదారులు చేసిందే పని అన్నట్లుగా కొనసాగుతోంది. డివైడర్లు, డ్రైనేజీలతోపాటు రోడ్ల పనులకు పెద్దవాగు ఇసుకను వినియోగించాలనే నిబంధనలకు భిన్నంగా... స్థానికంగా లభించే నల్లటి ఇసుకను వినియోగిస్తున్నారు. దీంతో పనులు పూర్తికాకుండానే నిర్మాణాలు పగులు తేలుతున్నాయి.