తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ మరింత కఠినతరం.. లాఠీలు ఝుళిపించిన పోలీసులు - తెలంగాణలో లాక్​డౌన్​

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాగం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లపైకి వచ్చే ప్రతీ వాహనాన్ని ఆపుతున్న పోలీసులు.. పాసుంటేనే అనుమతిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసుల నమోదుతో పాటు వాహనాలను జప్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రవాణాపై ఆంక్షలు విధిస్తున్నారు.

lockdown situations in districts
lockdown situations in districts

By

Published : May 22, 2021, 10:22 PM IST

Updated : May 22, 2021, 10:29 PM IST

లాక్​డౌన్​ మరింత కఠినతరం.. లాఠీలకు పని చేప్పిన పోలీసులు

సీఎం ఆదేశాలతో జిల్లాల్లోనూ పోలీసు యంత్రాంగం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అనుమతిలేకుండా తిరుగుతున్న 610 వాహనాలు సీజ్‌ చేశారు. ఆసిఫాబాద్‌లో లాక్‌డౌన్‌ అమలును.. అదనపు ఎస్పీ సుదీంద్ర పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను కట్టడి చేయాలని సిబ్బందికి సూచించారు. రామగుండం సీపీ సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి మంచిర్యాలలో విధులు నిర్వర్తించారు. అనుమతి లేకుండా వాహనాలపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదుచేశారు. పాసులున్న వారు నిర్దేశిత సమయంలోనే... బయటికి రావాలని సూచించారు. అత్యవసర సేవలను సాకుగా చూపించి బయటతిరిగితే సహించేది లేదని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు.

వాహనాలు స్వాధీనం...

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ని పోలీసులు కఠినతరం చేశారు. పది గంటల తర్వాత అకారణంగా రహదారులపైకి వచ్చే వాహనదారులను కట్టడిచేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పలుచోట్ల కేసులు నమోదు చేసి.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట కూడళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేశారు. లాక్‌డౌన్‌ అమలును క్షేత్రస్థాయిలో పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి పరిశీలించారు. తప్పుడు పత్రాలతో అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ.. వాహనాలను జప్తు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గద్వాలలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌ శర్మ నిబంధనల అమలును పరిశీలించారు.

ఉల్లఘనులపై కేసులు...

జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లిలో లాక్‌డౌన్‌ సరళిని కలెక్టర్ రవి పరిశీలించారు. మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా తిరిగేవారిపై జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనులు ఎంతటివారైనా కేసులు తప్పవని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సిరిసిల్ల ప్రధాన కూడలి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై నిబంధనలు పాటించని వాహనాలు సీజ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పాసులుంటేనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో పోలీస్ కమిషనర్ కార్తికేయ స్వయంగా వాహనాలు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

పాసులు తప్పనిసరి...

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో డ్రోన్ కెమెరాల వినియోంచి నిఘాను కఠినతరం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకునే చెక్‌పోస్టును ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. ఏపీ నుంచి వచ్చే వాహనదారులకు లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలోనూ.. ఈ-పాస్ తప్పనిసరని స్పష్టంచేశారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లను అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు.

దుకాణాలు సీజ్​...

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి రవాణాపై ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకునే అశ్వారావుపేట, సత్తుపల్లిలో అత్యవసర వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు. మినహాయింపు సమయం దాటినా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను సీజ్‌ చేశారు.

ఇదీ చూడండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'

Last Updated : May 22, 2021, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details