తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై లాక్‌డౌన్‌ ప్రభావం.. గణనీయంగా పడిపోయిన ఆదాయం - ఆర్టీసీపై లాక్​ డౌన్ ప్రభావం

లాక్​ డౌన్​ వల్ల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి దయనీయంగా మారింది. అంతర్రాష్ట్ర సర్వీసుల రద్దుతో ఆదాయానికి పూర్తిగా గండిపడింది. రోజుకు రూ.80 లక్షలు రావాల్సిన ఆదాయం రెండున్నర లక్షలకే పరిమితమైంది.

Lock down effect on rtc
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీపై లాక్ డౌన్ ప్రభావం

By

Published : May 19, 2021, 3:52 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రభావం ఆర్టీసీపై స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనున్న మహారాష్ట్రతో పాటు మనరాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్నందున అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలకు బ్రేక్‌ పడింది. ఉదయం కొన్ని సర్వీసులు నడిచినప్పటికీ... తరువాత డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఫలితంగా సగటున రోజుకు రూ.80 లక్షలు రావాల్సిన ఆదాయం కేవలం రూ.2.50 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అంతర్రాష్ట్ర రవాణా బంద్​ ఎఫెక్ట్..

రాష్ట్రానికే తలమానికమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల డిపోల పరిధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​కు అనుసంధానం చేస్తూ సగటున రోజుకు రెండు లక్షల 50 వేల కిలోమీటర్ల వరకు బస్సులు తిరుగుతుండగా దాదాపుగా రోజుకు రూ.80లక్షల ఆదాయం వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12 లాక్‌డౌన్‌ కారణంగా అంతర్రాష్ట్ర సర్వీసులకు పూర్తిగా బ్రేక్‌పడింది. ప్రస్తుతం కేవలం 8500 కిలోమీటర్లకే బస్సులు పరిమితం కావడంతో ఆదాయం రూ.2.50 లక్షలు మించడంలేదంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరుడిపోల పరిధిలో ఉదయం 10 గంటల లోపు సమీప గ్రామీణ ప్రాంతాలకు వెళ్లివచ్చే బస్సులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

హైదరాబాద్‌కు బంద్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 620 బస్సులు ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు రోజుకు 20 బస్సులకు మించి తిరగడం లేదు. నిర్మల్‌ డిపో నుంచి హైదరాబాద్‌కు కేవలం రెండు బస్సులు, మంచిర్యాల నుంచి ఒక బస్సుతోనే సరిపెట్టాల్సి వస్తోంది. ప్రయాణికులు సైతం ఇంటికే పరిమితం కావడంతో ఆర్టీసీ ఆదాయంపై గణనీయమైన ప్రభావం పడుతోంది.

ఇదీ చూడండి:కేంద్రం కేటాయించిన ఎరువులను ప్రతి నెలా డ్రా చేయాలి: నిరంజన్​

ABOUT THE AUTHOR

...view details