తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏజెన్సీలో కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ.. ఫలితంగా డెంగీ విజృంభణ - dengue fever cases in adilabad

ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుంటే.. మరోవైపు డెంగీ జ్వరం ఆదిలాబాద్​ జిల్లా వాసులను వెంటాడుతోంది. పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోనూ రోజురోజుకు వ్యాధి తీవ్రత విస్తరిస్తోంది. డెంగీతో ప్రభుత్వాసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పారిశుద్ధ్య నిర్వహణపై కొరవడిన అవగాహనతో ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

lack of sanitation in Adilabad district causes dengue fever
ఏజెన్సీలో డెంగీ విజృంభణ

By

Published : Nov 9, 2020, 1:03 PM IST

ఏజెన్సీలో కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ.. ఫలితంగా డెంగీ విజృంభణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డెంగీ వ్యాధితో పాటు సాధారణ జ్వరాల తీవ్రత క్రమంగా పెరుగుతుండటం కలకలం సృష్టిస్తోంది. గతేడాది ఈ సమయానికి 769 డెంగీ కేసులు నమోదైతే.. ఈ సంవత్సరం 260 కేసులే నమోదైనప్పటికీ ... జ్వరాల బారిన పడిన వారి సంఖ్య 47,190కు చేరుకోవడం ఆందోళనకు దారితీస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లాంటి మైదాన ప్రాంతాలతోపాటు ఉట్నూర్‌ ఏజెన్సీలో తీవ్రత క్రమంగా పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి, రోగాలకు దారి తీస్తోంది.

రాష్ట్రంలోనే చలితీవ్రత ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డెంగీ విజృంభిస్తుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పరిశుభ్రంగా మారిన పరిసరాలన్ని ఇప్పుడు మళ్లీ.. ఎప్పటి మాదిరిగా తయారై వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి.

పర్యవేక్షణ కరవు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 పురపాలక సంఘాలతో పాటు 1,508 గ్రామ పంచాయతీల్లో అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కూడా సాఫీగా సాగడం లేదు. తద్వారా వ్యాధిగ్రస్థులకు సరైన వైద్యం అందడంలేదు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక వైద్య కళాశాల అయిన ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు రోజుకు పదులు సంఖ్యలో డెంగీ వ్యాధిగ్రస్థులు వస్తున్నారు.

గతేడాది కంటే తక్కువే..

ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌, గాదిగూడ, జైనూర్‌, కెరమెరి మండలాల్లో సర్కారు వైద్యం సరిగా అందడం లేదు. ఏళ్ల తరబడిగా వైద్యులతో పాటు వైద్య సిబ్బంది పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంత వల్ల క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణకు అవరోధం ఏర్పడుతోంది. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలోనూ స్పష్టత కనిపించడం లేదు. ఏజెన్సీలో తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతుంటే... గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వ్యాధి తీవ్రత తక్కువగా ఉందనే భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అంటీముట్టనట్లు..

ఏజెన్సీలో వ్యాధితీవ్రత పెరుగుతున్నా... ఉట్నూర్‌ ఐటీడీఏ యంత్రాంగం... అంటీముట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. పరిస్థితి విషమించకముందే నివారణ చర్యలపై దృష్టి సారించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details