Pranahita Pushkaralu : ఈ నెల 13 నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కుమురం భీం జిల్లాలోని తుమ్మిడిహట్టి, మంచిర్యాలలోని వేమనపల్లి, అర్జునగుట్ట వద్ద పుష్కరాలు నిర్వహించనున్నారు. ప్రాణహిత, గంగా నదుల సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలోనూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం తగిన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, తాత్కాలిక మూత్రశాలలు, పనులు పూర్తిస్థాయిలో కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Pranahita Pushkaralu Facilities : తుమ్మిడిహట్టి వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు రెండు తడకలతో 2 షెడ్లు ఏర్పాటు చేశారు. పిండ ప్రధానాలు చేసేందుకు రెండు పందిళ్లు వేశారు. పదుల సంఖ్యలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించాల్సి ఉన్నా... గతంలో కట్టిన నాలుగింటికి మరమ్మతులు చేపడుతున్నారు. మరో నాలుగు కొత్తగా నిర్మిస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇవి ఎలా సరిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Pranahita Pushkaralu in Telangana : మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, అర్జున గుట్ట పుష్కరఘాట్ పనులు కొంతమేర పర్వాలేదనట్లుగా సాగుతున్నాయి. అర్జునగుట్ట వద్ద తాగునీటి వసతి, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు సహా 30 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పుష్కర్ ఘాట్ పై మట్టి తొలగింపుతోపాటు నదిలో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. నదీ భాగంలో శ్రాద్ధ మండపాలు, కేశ ఖండనశాలలు నిర్మించాల్సి ఉంది. వేమనపల్లికి చేరుకునే దారిలో గుంతల పూడ్చివేత, ముళ్లపొదల తొలగింపు కొనసాగుతుంది.