ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ప్రారంభమైంది. తొలి విడతగా 76 మంది మర్కజ్ యాత్రికులను రెవెన్యూ శాఖ గుర్తించింది. వీరి వివరాలు వైద్యారోగ్యశాఖ వద్ద అందుబాటులో లేవు. 13 మంది వారితో దగ్గరగా మసిలినవారిని వైద్యశాఖ గుర్తిస్తే, మిగిలిన 116 మంది ప్రాథమికంగా వారిని కలసిన వారిని రెవెన్యూ శాఖ గుర్తించింది. మరో 685 మంది వారి దగ్గరివారిని పోలీసు యంత్రాంగం గుర్తించింది. మరో 28 మందిని ఆదిలాబాద్ ఆర్డీవో ఆధ్వర్యంలో గుర్తించారు.
కరోనా నివారణలో కీలకంగా వ్యవహరించాల్సిన వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లేదనే విషయం ప్రారంభంలోనే జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన దృష్టికి వెళ్లింది. పలుమార్లు ఆమె దిశానిర్దేశం చేసినా మార్పు కనిపించడం లేదు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులపై కొంతమంది దాడులకు యత్నించినప్పుడు కూడా అధికారులు పెద్దగా స్పందించలేదు.
క్షేత్రస్థాయిలో నిఘా
సరిహద్దు ప్రాంతాలైన జైనథ్, తలమడుగు, బోథ్, నార్నూర్, నేరడిగొండ మండలాల పరిధిలో వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణ భారత దేశం నుంచి జిల్లా మీదుగా వచ్చిపోయే వ్యక్తుల వివరాలను సేకరించాలి. ఆరోగ్యరీత్యా అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇందులో వైద్యారోగ్యశాఖ పాత్ర కీలకం. క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. జిల్లా వైద్యాశాఖ అధికార యంత్రాంగం సమీక్షలు, సమావేశాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటోంది.
సాక్ష్యాలివిగోే
వారణాసి నుంచి నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డికి వెళ్తున్న 41 మంది యాత్రికులతో కూడిన బస్సు ఈనెల రెండో తేదీన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జైనథ్ మండలం పెన్‌గంగ వద్దకు వచ్చింది. అక్కడ స్క్రీనింగ్ నిర్వహించిన వైద్యసిబ్బంది స్టాంపింగ్ వేయకుండానే వదిలేశారు. వారు ఆర్మూర్ వెళ్లాక నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం గుర్తించి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. అదేరోజు రాత్రి జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన పెన్‌గంగ వద్దకు వెళ్లి వైద్య, రెవెన్యూ అధికారులను తీవ్రస్థాయిలో మందలించారు.
మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన నెమ్మని సురేష్ (58)కు శరీరంలో పొటాషియం సోడియం లెవల్ పడిపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు శనివారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. తలమడుగు మండలం లక్ష్మిపూర్ చెక్‌పోస్టు వద్దకు రాగానే విధుల్లో ఉన్న రెవెన్యూ, వైద్యసిబ్బంది అడ్డగించారు. మహారాష్ట్ర వైద్యులు రిఫరింగ్ ప్రిస్కిప్షన్ చూపించినప్పటికీ అనుమతించ లేదు. గంటసేపు సురేష్ కుటుంబీకులు ప్రాధేయపడినప్పటికీ కరుణించకపోవడంతో బాధితులు తిరిగి బాధితుడిని అదే వాహనంలో కిన్వట్‌కు తరలించారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణలో స్పష్టత లోపిస్తోంది.
మహారాష్ట్ర నుంచి ఎవరినీ రానీయడం లేదు
ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి చందును సంప్రదించగా లక్ష్మిపూర్ చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘటన తనకు తెలియదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులను జిల్లాకు రానీయడం లేదన్నారు. మిగిలిన వ్యక్తులు ఎలా వస్తున్నారు? రోజు పదుల సంఖ్యలో వాహనాల్లో ఎలా వెళ్తున్నారంటే... తమకు క్రమం తప్పకుండా సమావేశాలు ఉంటున్నాయంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.