ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం కిన్నెరపల్లి. ఇక్కడ 100 కుటుంబాలుండగా, 329 మంది జనాభా నివసిస్తున్నారు. అయిదేళ్ల కిందట మరణాలు జరిగినా అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఈ సమస్యల ఎక్కువ కావడంతో ఆందోళనకు గురయ్యారు గ్రామస్థులు. రెండేళ్లలో 13 మంది మృత్యువాత పడగా, మరో ఏడుగురు సమస్యతో సతమతమవుతున్నారు. చనిపోయిన వారిలో 35 ఏళ్లలోపు వారు ముగ్గురు ఉండగా, 50 ఏళ్లలోపు వారు 10 మంది ఉన్నారు. సమస్య ఏంటో అర్థం కాక, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా నిరుపేదలే కావడం, కనీసం వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో బయటకు వెళ్లేలేని పరిస్థితి ఉంది.
కనీసం శుద్ధ జలం లేదు
గ్రామంలో ఇంత మంది చనిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు సరిగా లేక, వర్షాకాలంలో బురదమయంగా మారడంతో బాహ్యప్రపంచానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అత్యవసరంలోనే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనూ కనీస శుద్ధ జల పరికరాలను ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దయనీయం వీరి పరిస్థితి..
వీరు మాధవ్ భార్య పార్వతీబాయి, పిల్లలు. కొన్ని రోజుల కిందట మాధవ్ కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఒంటరివారయ్యారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ఎలా పోషించాలంటూ కన్నీరు కార్చింది.
మా మూడు కుటుంబాల్లో మగ దిక్కు లేదు
మా కుటుంబంలో నా భర్తతోపాటు ఇద్దరు మరుదులు కిడ్నీ సమస్యతో మృతి చెందారు. అండగా ఉండేవారు లేకపోవడంతో మా మూడు కుటుంబాలు వీధిన పడ్డాయి. పిల్లల చదువులు, పనులు చేసుకోవడం కష్టంగా మారింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. కనీసం సరైన గూడు లేక తల్లడిల్లుతున్నాం. ఆర్థికంగా చాలా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
-రాధాబాయి, గ్రామస్థురాలు