కార్తిక మాసం సందర్భంగా రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఈ మాసంలో దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మహిళలంతా కలిసి సామూహికంగా పరమశివుడిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగిస్తారు. ఇక కార్తిక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపాలను వెలిగించి.. నైవేద్యాలను సమర్పించి కోరిన కోర్కెలు తీర్చాలంటూ ఆ నీలకంఠేశ్వరుడిని ప్రార్థిస్తారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలంతా కలిసి మహా దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుక కన్నులపండువగా సాగింది. ఆదిలాబాద్ డైట్ మైదానం దీపాలతో వెలుగులీనింది. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి.. శివయ్యకు పూజలు నిర్వహించారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి.. ఎమ్మెల్యే, ఫౌండేషన్ ఛైర్మన్ జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరయ్యారు.