ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో జంబుగ నర్సరీ ఉద్యాన పంటలకు ఊతం ఇస్తోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 1989లో ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ నర్సరీ కం ట్రైనింగ్ సెంటర్ పేరిట ప్రారంభమైంది ఈ కేంద్రం. 86 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వాటి నుంచి ఏటా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
త్వరలోనే ఆయిల్ మిల్:
ఈ ప్రాంతంలోని గిరిజనులకు వివిధ రకాల మొక్కలు అంటు కట్టు విధానంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం నీటి వనరులు బాగా ఉండటం వల్ల 1998లో ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామింగ్ రీసర్చ్ సెంటర్ ద్వారా పామాయిల్ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. వాటి ఎదుగుదల బాగా ఉండటం వల్ల ఇటీవల శాస్త్రవేత్తలు సందర్శించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ఆయిల్ మిల్ నెలకొల్పనున్నారు. దీని వల్ల ఉపాధి లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
86 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ:
పండ్ల తోటల సాగులో జిల్లాలోనే ప్రత్యేక చోటు సంపాదించుకుంది జంబుగ నర్సరీ. కాగజ్నగర్ మండలం జంబుగ శివారులో 1989లో 86 ఎకరాలను నర్సరీకి కేటాయించారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, రేగు, చింతచెట్లతో 300 పామాయిల్ మొక్కలను నాటారు.