Hostels in Joint Adilabad District: పాడైపోయిన కూరగాయలు.. రుచి లేని భోజనం.. వంటగదుల్లో అపరిశుభ్రత. ఇదీ ఆదిలాబాద్ జిల్లాలోని పలు వసతి గృహాల్లో దుస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్బాలు, వసతి గృహాలు కలిపి మొత్తం 119 ఉన్నాయి. ఇందులో సుమారు 50 వేల మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. వసతి పరిస్థితి ఎలా ఉన్నా.. రోజూ తినే ఆహారమే విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కుళ్లిపోయిన కూరగాయలు, రాళ్ల బియ్యం, పాడైన ఆలుగడ్డలు, ఉల్లిపాయలను వినియోగిస్తున్న తీరు ఈటీవీ-ఈటీవీ భారత్ పరిశీలనలో వెలుగుచూసింది.
అధికారుల తనిఖీ తర్వాత ఒకట్రెండు రోజులు నాణ్యమైన సరుకులతో వంట చేస్తున్న నిర్వాహకులు.. ఆ తర్వాత పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ఆ తర్వాత విద్యాలయాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా సరుకులు, కూరగాయాలు, మాంసాహారం సరఫరా చేసే ఏజెన్సీదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బిల్లుల తయారీ సమయంలో యాజమాన్యాలతో ఏజెన్సీదారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కుళ్లిన కూరగాయలు వద్దని చెబుతున్నా.. బలవంతంగా ఇచ్చి పోతున్నారని వంట మనుషులు చెబుతున్నారు.
మరోవైపు వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు ఏదైనా చెబితే వారిని బెదిరించడం, టీసీ ఇస్తామని భయపెట్టడంతో వారూ ఏ విషయం బయటకు చెప్పడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారులు మరింత చొరవ చూపి.. వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించాల్సిన అవసరముంది. వంటగది పరిసరాల్లోనూ పరిశుభ్రత పాటించాలి.