ఎరువుల అమ్మకాల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేయడంతో పాటు, ఎప్పటికప్పుడు నిల్వలు తెలుసుకొని, సరిపడా సరఫరా చేసేందుకు వీలుగా విక్రయదారుల వద్ద పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రైతు ఆధార్‌కార్డు, వేలిముద్ర తీసుకున్న తర్వాతనే ఎరువులు ఇవ్వాలని సూచించింది. దీని వల్ల ఏ రోజు ఎన్ని ఎరువులు అమ్మకం అయ్యాయి. ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉందనే వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుంది.
జరుగుతుంది ఇలా...
కరోనా కారణంగా పీఓఎస్ మిషన్లను వినియోగించడం లేదు. గ్రామాల నుంచి రైతులు ఎరువులకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేసింది. రైతుల ఆధార్‌కార్డు నమోదు చేయడంతో పాటు, ఎరువులను తీసుకెళ్లే వారి వేలిముద్ర తీసుకుంటే సరిపోతుందని సూచించింది. గ్రామానికి చెందిన అయిదారుగురు రైతులు తమ ఆధార్‌కార్డులు ఇచ్చి, ఆటో, లేదా ఇతర వాహన డ్రైవర్లను యూరియాకు పంపిస్తున్నారు. ఎరువుల కొనుగోళ్లలో పరిమితి లేకపోవడంతో ఆధార్‌కార్డుల నెంబర్లు నమోదు చేసి ఎన్ని సంచులు అంటే అన్ని ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు 30-40 మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ పరిస్థితి:
* ఆదిలాబాద్ జిల్లాలో కుమారి గ్రామానికి చెందిన ఓ రైతు 15 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ముత్నూర్‌కు చెందిన మరో రైతు 12 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అవసరానికి మించి కొనుగోలు చేసిన రైతుల జాబితాను రూపొందించి అధికారులు గ్రామాల్లో విచారణ జరుపుతున్నారు.
* నిర్మల్ జిల్లాలో కుబీర్ గ్రామంలో ఒక రైతు 55 మెట్రిక్ టన్నులు, మరో రైతు 38, గుల్‌మడగలో ఒకరు 45 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తేలింది.
* మంచిర్యాల జిల్లాలో మల్లిడి గ్రామానికి చెందిన ఒక రైతు 22, టేకుమట్ల గ్రామంలో ఓ రైతు 21 మెట్రిక్ టన్నుల ఎరువులు కొనుగోలు చేసినట్లు ఉంది.