ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ లేఅవుట్ల దందా మళ్లీ తెరమీదికొచ్చింది. ఏళ్లకిందట సర్పంచులు అనుమతి ఇచ్చినట్లు కాగితాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్నారు. మావల మండల పరిధిలోకి వచ్చే పట్టణంలోని నాలుగు వరుసల రహదారి పక్కన కొత్త లేఅవుట్లు వెలిశాయి. కొత్తహౌసింగ్‌బోర్డు ఆవల సైతం ఇదే పద్ధతిలో లేఅవుట్లు ఏర్పాటుచేశారు. దుర్గానగర్ కాలనీలో పదుల సంఖ్యలో వాహనాలతో యుద్ధప్రాతిపదికన భూమిని ప్లాట్లకోసం చదును చేస్తున్నారు. శంకర్ గుట్ట సమీపంలో కొంత అసైన్డ్‌భూమిని సైతం కొందరు జేసీబీతో తవ్వేస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లడం లేదు.
వాస్తవానికి పురపాలకంలో విలీనమైన గ్రామాల్లో కొత్త లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకుముందులా వరంగల్, హైదరాబాద్ తరహాలో కాకుండా ఇక్కడే జిల్లా పాలనాధికారి ద్వారా అనుమతి ఇస్తామని ‘పుర’ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు సులువుగా ఉన్నప్పటికీ స్థిరాస్తి వ్యాపారులు అక్రమ దందా వైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా రహదారులు 40 అడుగుల వెడల్పులో ఉండాలి. అదే అక్రమ లేఅవుట్లలో 20 అడుగుల వెడల్పుతోనే రహదారులు సరిపెడుతున్నారు. దీనికితోడు విద్యుత్తు, మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి వంటి అన్ని వసతులు సదరు వ్యాపారే కల్పించాల్సి ఉండటంతో ఇది భారమని అనుమతి తీసుకోవడం లేదు. పుర అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ దందా సాఫీగా సాగుతోంది.