అవన్నీ బీడు భూములు.. కనీసం ప్లాట్లుగా కూడా విభజించని ప్రాంతాల్లో కాగితాలపై ఇళ్లొచ్చాయి.. చట్టంలోని వెసులుబాటుతో ఇంటి నంబర్లు కూడా పుట్టుకొచ్చాయి. ఆస్తి పన్ను మదింపు జరిగిపోయింది. ఇంకేముంది వాటికి రిజిస్ట్రేషన్ సులువైపోయింది. అనధికారిక లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో స్థిరాస్తి వ్యాపారులు ఈ కొత్త దందాకు తెరలేపారు. రాష్ట్రంలోని కొన్ని పట్టణాలు, నగరాల్లో అక్రమ ఇంటి నంబర్లతో కొందరు దొడ్డిదారి రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టారు. కొన్నిచోట్ల ఏకంగా ప్రభుత్వ స్థలాలనే ఇళ్లుగా చూపి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. కొత్త ఇళ్లకు ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ అసెస్‌మెంట్) ద్వారా ఇంటి నంబరు పొందడం, సొంతంగానే ఆస్తిపన్ను మదింపు చేసుకునే విధానాన్ని పురపాలక శాఖ సుమారు ఏడాదిన్నర కిందటి నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది. అలాంటి ఇళ్లను పురపాలక అధికారులు తర్వాత పరిశీలిస్తారు. తప్పుడు వివరాలుంటే జరిమానాతో పన్ను వసూలు చేస్తారు. ఈ విధానాన్నే ఇప్పుడు అక్రమార్కులు అనువుగా మలచుకుంటున్నారు.
పురపాలికల్లో గందరగోళం
అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. కనీసం ఒకసారైనా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించింది. ఇంటి నంబర్లు ఉంటే వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అందుకే స్థిరాస్తి వ్యాపారులు ఈ దందాను ప్రారంభించారు. గత నెల వరకూ కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ అడ్డగోలు వ్యవహారం రాష్ట్రమంతటా విస్తరించింది. కొందరు ప్రజాప్రతినిధులు పురపాలకశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్వీయ ధ్రువీకరణ విధానపరమైన అంశం కావడంతో తామేమీ చేయలేమని చెబుతున్నారు. లేని ఇళ్లకు వందల సంఖ్యలో ఇంటి నంబర్లు పుట్టుకొస్తుండటంతో పురపాలికల్లో గందరగోళం నెలకొంటోంది.
ఆదిలాబాద్‌లోనే 400కు పైగా