తెలంగాణ

telangana

ETV Bharat / state

చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు! - ADILABAD TRIBAL PEOPLE PROBLEMS

వారుండేది అడువుల్లోనే అయినా న్యాయంగా బతుకుతారు. మనుషులంతా మంచోళ్లే అని నమ్మే అమాయకులు. నగరం నుంచి గూడేలకు ఎవరొచ్చినా అపురూపంగా చూసుకుంటారు. కానీ అడవిలో ఉన్న జిత్తులమారి నక్కలు నగరంలో మనుషుల రూపంలో ఉంటాయని తెలుసుకోలేకపోయారు. వారు చెప్పిన మాటలు నమ్మి నిలువునా మోసపోయారు. విషయం తెలిసాక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. అమాయకంగా చూస్తూ అప్పులు చేసి మరీ డబ్బులిచ్చామని తెల్లమొహం వేశారు.

ఆదివాసీలను నిండాముంచిన గ్యాస్ సంస్థ

By

Published : Nov 15, 2019, 2:31 AM IST

Updated : Nov 15, 2019, 7:45 AM IST

ఆదివాసీలను నిండాముంచిన గ్యాస్ సంస్థ

ఆదిలాబాద్‌ మన్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ నకిలీ సంస్థ... వంటగ్యాస్ భద్రత పేరిట ఆదివాసీలను నిలువుదోపిడీ చేసింది. వంటగ్యాస్ వాడకంలో జాగ్రతలు పాటించనట్లయితే ప్రాణాలు పోతాయని భయపెట్టింది.

ప్రాణాలు పోతాయంటూ భయపెట్టారు...

గత నెల ఆగస్టులో గ్యాస్‌ సేఫ్‌ ఇండియా సంస్థ పేరిట ఓ బృందం ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని ఏజెన్నీ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రధానంగా చిన్నలోకారి, లోకారి, వాన్వట్‌, లింగుగూడ గ్రామాల్లో తిరిగి ఆదివాసీలందరినీ ఒకదగ్గరకు చేర్చి... వంటగ్యాస్ భద్రత గురించి వివరించింది. పైగా వంటగ్యాస్ నుంచి వచ్చే మంటలను సేఫ్టీ డివైజ్‌ పరికరంతో ఎలా నియంత్రించవచ్చో ప్రయోగాత్మకంగా చూపించింది. మంటలను సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాలు పోతాయంటూ భయపెట్టారు. ప్రమాదం జరగకూడదనుకుంటే... నాలుగు వేల రూపాయల విలువైన సేఫ్టీ డివైజ్​ను తీసుకోవాలని సూచించారు.

నాలుగు వేలు చెల్లిస్తే... ఖరీదైన వస్తువులు మీ సొంతం

ఈ పరికరాన్ని రాయితీపై వెయ్యి రూపాయలకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ వినియోగదారులు అడ్వాన్సుగా నాలుగు వేలు చెల్లిస్తే... డివైజ్‌తోపాటు ఎల్ఈడీ టీవీ, ఫ్రిజ్‌, ల్యాప్‌టాప్‌, వాషింగ్‌ మిషన్‌ వస్తాయని నమ్మబలికారు. ఈ నెలలో డబ్బులు చెల్లిస్తే వచ్చే నెలలోనే వస్తువులు మీ వద్దకు వస్తాయని తెలిపారు. ఏమైనా అనుమానాలుంటే 9390307009, 7249487273 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. అలాగే తమ కార్యాలయం ఎల్బీనగర్-నాగోల్‌ రోడ్డు వద్ద గల నక్షత్ర ఆసుపత్రి పక్కన ఉంటుందని చెప్పింది. ఇదంతా నిజమని నమ్మిన ఆదివాసీలు అప్పూసొప్పు చేసి ఒక్కొక్కరుగా నాలుగు వేల రూపాయలను చెల్లించారు. ఆగస్టులో చెల్లిస్తే... సెప్టెంబర్ నెల అయిపోయినా వస్తువులు రాలేదు. పదిరోజులపాటు కలిసిన వారి ఫోన్ నెంబర్లు కలవకుండా పోవడంతో బాధితులకు మోసపోయామనే భావన కలిగింది.

గ్యాస్ సేఫ్ ఇండియా సంస్థే లేదు...

స్థానికంగా ఉన్న గ్యాస్ నిర్వాహకులతో విషయం చెప్పగా... గ్యాస్ సేఫ్ ఇండియా అనే సంస్థ లేనట్లు తెలుసుకున్నారు. మోసపోయిన తమకు న్యాయం చేయాలని కోరుకునే ఆదివాసీల వేదనలో ఇంకా అమాయకత్వమే కనిపిస్తోంది. ప్రత్యేకంగా కారులో వచ్చిన గ్యాస్‌సేఫ్‌ సంస్థ బృందం... అడ్వాన్స్ చెల్లించిన ప్రతి ఒక్కరికి ఓ రసీదు ఇచ్చి నమ్మించింది. బాధితులకు ఇచ్చిన రసీదులపై ఉన్ననంబర్లకు ఈటీవీ భారత్​ - ఈనాడు సభ్యుల బృందం ఫోన్‌ చేయగా... అవి మనుగడలో లేవనే సమాధానం వస్తోంది.

ఇవీ చూడండి: రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి: హైకోర్టు

Last Updated : Nov 15, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details