Rains: ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం... పొంగుతున్న వాగులు - Heavy rains in adilabad
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలతో వణుకుతోంది. జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. రేపు కూడా భారీ వర్షాలు కురవొచ్చనే వాతావారణశాఖ ప్రకటనతో ప్రజల్లో మరింత ఆందోళన కనిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం
By
Published : Aug 19, 2021, 12:26 PM IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్‌లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 12.8 సెంటిమీటర్లు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో 12, తాంసిలో 11, ఆదిలాబాద్‌లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం వల్ల పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
జిల్లాలో వర్షపాతం వివరాలిలా....
ప్రాంతం
వర్షాపాతం
తలమడుగు
12.8 సెంటిమీటర్లు
బజార్ హత్నూర్
12.04 సెంటిమీటర్లు
తాంసి
11.28 సెంటిమీటర్లు
ఆదిలాబాద్
10.26 సెంటిమీటర్లు
వానొస్తుందంటే చాలు ఆదిలాబాద్ జిల్లా రైతుల వెన్నెముకలో దడ పుడుతోంది. ఎక్కడ భారీ వర్షం కురిసి వరద ముంచెత్తుతుందోనని.. ఇప్పుడిప్పుడే వేసిన పంటంతా నీటిపాలైపోతుందేమోనని వణికిపోతున్నారు. గత నెలలో కురిసిన వానతో నష్టపోయిన కర్షకులు.. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఆవేదనలో ఉన్నారు. రేపు కూడా వర్షాలున్నాయన్న వాతావరణశాఖ ప్రకటనతో భయాందోళనకు గురవుతున్నారు.
గత నెలలో పోటెత్తిన వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90,150 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43,601 ఎకరాల్లో పంట వరదపాలైంది. నిర్మల్ జిల్లాలో 24,211 ఎకరాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో 15,380 ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 6,958 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు.