సహజసిద్ధమైన అటవీసంపదకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 2.35 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కానీ ఇప్పటిదాకా కేవలం 50లక్షలు మొక్కలు నాటలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 50.35 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యానికి 11లక్షలు మొక్కలు నాటినట్లు అధికారిక లెక్క.
నిర్మల్ జిల్లాలో ఇలా...
రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్ జిల్లా లక్ష్యం 65లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యానికి కేవలం ఎనిమిది లక్షలే మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కల ద్వారా వెల్లడవుతోంది.
మంచిర్యాల జిల్లాలో ఇలా...
మంచిర్యాల జిల్లాలో 67.25 లక్షలకు గానూ 17లక్షలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53లక్షలకుగానూ 12.5లక్షలు మొక్కలు నాటినట్లు లెక్కలు చూపుతున్నప్పటికీ... క్షేత్రస్థాయలో దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
చెన్నూర్‌లో ఇలా...
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూర్ మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది 1.53 లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యంకాగా కేవలం 291 మొక్కలు నాటారంటే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం వెల్లడవుతోంది.
ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో
ఆదిలాబాద్‌లో గతనెల 25న రాష్ట్ర అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో శాసనసభ్యులు, పాలనాధికారుల సమక్షంలో జిల్లా హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగునంగా ఊరూరా హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని స్వయంగా హితోపదేశం చేసిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ... నాటినవాటిలో 85 శాతం మొక్కలను సంరక్షించుకోనట్లయితే పదవులకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దాంతో మొక్కలు నాటి పదవులకు ఎసరు తెచ్చుకోవడం ఎందుకనుకుంటున్నారో ఏమో... తెలియదు కానీ... పట్టణం, పల్లె అనే తేడాలేకుండా హరితహారం మందకొడిగానే సాగుతోంది.
ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్ మున్సిపాల్టీల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం పడకేసింది. ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా పట్టించుకోవడంలేదు. చెన్నూరు మున్సిపాల్టీలోనైతే లక్ష్యానికి సరిపడ మొక్కలు సైతం అందుబాటులో లేవు. అనుకున్నరీతిలో మొక్కలు నాటే కార్యక్రమం సాగడంలేదని అంగీకరిస్తున్న అటవీశాఖాధికారులు... వర్షాభావంతో సమస్య తలెత్తున్నట్లు పేర్కొంటున్నారు.
హరితహారానికి జులై మాసమే అత్యంత కీలకం. ప్రారంభంలో చూపించిన ఉత్సాహానికి అనుగుణంగా మొక్కలునాటితేనే అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. లేనట్లయితే లక్ష్యం ఘనం... ప్రగతి గగనం అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఇదీ చదవండి :ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్