ఆదిలాబాద్ పట్టణం దోబీకాలనీకి చెందిన ఈ బామ్మ పేరు బండి పొచ్చుబాయి. శతాధిక వృద్ధురాలు. వయసు 110 సంవత్సరాలు. మనవడు బండి అశోక్ పట్టణంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్. తన తల్లిదండ్రులు చనిపోయినా ఇంటికి పెద్దదిక్కుగా మిగిలిన నాయనమ్మను అశోక్ ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు.
ఈ మధ్యనే ఆయనకు మనవడు (కుమారుడి కొడుకు) పుట్టాడు. ఆ చిన్నారికి మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా నామకరణం చేశారు. బామ్మకు మునిముని మనవడిని (మనవడికి మనవడు) చూపించడం అత్యంత అరుదైనది కనుక.. మొదట ఆమె నోట్లో బంగారు చెంచాతో పాలు పోయాలని పెద్దలు చెప్పారు. దీంతో ప్రత్యేకంగా బంగారంతో చెంచా తయారు చేయించి ఆమెకు పాలు తాపారు. తర్వాత పసికందును ఆమె చేతుల్లో పెట్టి ఆశీర్వాదం తీసుకున్న కుటుంబీకులు భావోద్వేగానికి లోనై సంబరాలు చేసుకున్నారు.