తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కార్​ బడిలోనూ సాంకేతిక విప్లవం తెచ్చిన సార్​

ఆయనో సర్కారు బడి మాస్టారు. లాక్‌డౌన్‌ వేళ ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తుగానే ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించగా.. తన పాఠశాల పిల్లలకు అలాంటి సౌకర్యం కల్పించాలని సంకల్పించారు. అందుకు సాంకేతిక పరిజ్ఞానమే వేదికగా గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

govt teacher online class with new app in adilabad district
సర్కార్​ బడిలోనూ సాంకేతిక విప్లవం తెచ్చిన సార్​

By

Published : Sep 6, 2020, 6:35 PM IST

పల్లె విద్యార్థులను సాంకేతికబాట పట్టిస్తున్న ఈయన పేరు సంతోష్‌కుమార్‌. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌ మండలం నిపాని గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న ఈ మాస్టారు గతంలో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ వేళ ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు వీలుగా గూగుల్‌ క్లాస్‌రూమ్‌ యాప్‌ సహాయంతో.. ముందు నుంచే పాఠాలకు శ్రీకారంచుట్టారు. యాప్‌ ద్వారా బోధన, ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షలు రాసినవారికి గ్రేడ్‌లు ఇచ్చేలా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ యాప్ వినియోగంపై ఎన్​సీఈఆర్​టీ సహకారంతో 15 జిల్లాల్లోని 8 వేలమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

సర్కార్​ బడిలోనూ సాంకేతిక విప్లవం తెచ్చిన సార్​

యాప్‌పై సహచర ఉపాధ్యాయులకు అవగాహన

ఈ యాప్‌పై సహచర ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం వల్ల.. మిగతా వారూ ఇంటి వద్ద నుంచే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారి సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఫలితంగా లాక్‌డౌన్‌ సమయంలోనూ విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలకు అన్ని హంగులు సమకూర్చడంలో గ్రామస్థులు ఎంతో సహకరిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ అడుగు బయటపెట్టకుండా తరగతి గదిలో మాదిరి పాఠాలు నేర్చుకుంటున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చరవాణులను అందుబాటులో ఉంచుతున్నారు.

విపత్కర సమయంలోనూ విద్యార్థులకు విద్య

ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ బోధన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు చెబుతుండగా.. తల్లిదండ్రులూ సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉపాధ్యాయులు తలచుకుంటే కరోనా వంటి విపత్కర సమయంలోనూ విద్యార్థులకు మెరుగైన బోధన చేయవచ్చని నిరూపించింది నిపాని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఈ బడి మిగతా వాటిక ఓ దిక్సూచిలా మారిందనడంలో అతిశయోక్తి లేదని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details