ఆదిలాబాద్ రిమ్స్‌కు నిధుల పంట పండింది. జిల్లావాసులకు కార్పొరేట్ తరహా మెరుగైన వైద్య సేవలు అందించటానికి, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో రూ.20 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి స్వాస్థ్య్ యోజన (పీఎంఎస్‌ఎస్‌ఐ) కింద 2015లో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైంది. నిర్మాణ పనులకు 2016 జులైలో ఒప్పందం కుదిరింది. 2018 జనవరి నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నిధుల విడుదలలో జాప్యం, నిర్మాణ స్థలంలోని పురపాలక సంఘం వారి తాగునీటి పైప్‌లైన్ తొలగించటం తదితర కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించటంతో పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా వాటా నిధులు విడుదల చేస్తే ఆదిలాబాద్ జిల్లా వాసులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి..
కాన్పుల కోసం రిమ్స్‌కు వచ్చే వారి వద్ద ప్రతి పనికి లంచాలు వసూలు చేసే వ్యవహారంపై రిమ్స్ సంచాలకుడు బానోత్ బలరాం గురువారం విచారణ చేపట్టారు. ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితం అయిన ‘బాలింతలకు.. లంచాల చింత’ అనే కథనానికి స్పందించిన ఆయన ఈ వ్యవహారంపై నేరుగా విచారణను ప్రారంభించారు. ఆర్‌ఎంఓ శోభా పవార్, ఎస్‌పీఎం విభాగం బాధ్యురాలు విద్యావిల్సన్‌తో కలిసి ప్రసవ విభాగాన్ని సందర్శించి స్టాఫ్‌నర్సులు, సిబ్బంది నుంచి వివరాలను సేకరించారు. ఎవరైనా డబ్బులు అడిగితే సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని బాలింతలకు సూచించారు. ప్రసవ విభాగంలో పని చేసే సిబ్బందిని ప్రతి నెల మార్చే విధానాన్ని ప్రవేశపెట్టి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాలింతలకు పట్టీలు మార్చటం ఇక నుంచి గదిలో కాకుండా వార్డులోనే చేయాలని సిబ్బందికి సూచించారు.
ఐదంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 220 పడకలతో పూర్తి స్థాయిలో పని చేస్తే ఒక్కో విభాగంలో ప్రత్యేక వైద్య నిపుణులు అయిదుగురు చొప్పున, ప్రత్యేక నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎలాంటి శస్త్ర చికిత్సలైనా ఇక్కడే చేసే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం రిమ్స్ నుంచి మెరుగైన వైద్యం కోసం రోగులను ఇతర ప్రాంతాలకు తరలించే ఇబ్బందులు ఉండవు. పీజీ తరగతులు సైతం ఉండటంతో ప్రతి ఏడాది 50 మంది చొప్పున అయిదేళ్ల కాలంలో 250 మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు..