తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగోబా జాతర అంటే ఏమిటి..? ఎలా మొదలైంది..? - FULL STORY ABOUT NAGOBA JATHARA AT KESLAPU

పొరపాటున ఆలయ ద్వారానికి ఓ ఆదివాసీ చెయ్యి తగిలింది. ఆగ్రహించిన నాగరాజు ఆ భక్తుడిని శిక్షించడానికి వెంబడించాడు. తనని శిక్షించడానికి వచ్చిన దేవతామూర్తిని ఆ ఆదివాసీ భక్తిప్రపత్తులతో పూజించాడు. అంతే.. ఆ భక్తికి నాగరాజు ముగ్ధుడైపోయాడు. ఇకపై ప్రతీ ఏడాది ఇలాగే పూజలు చేయమని కోరాడు. అదే... నాగోబా జాతరగా మారింది. రేపటి నుంచి మొదలుకానున్న నాగోబా జాతరపై ఈటీవీ భారత్ స్పెషల్ స్టోరీ మీకోసం..

FULL STORY ABOUT NAGOBA JATHARA AT KESLAPUR
నాగోబా జాతర రేపే ప్రారంభం

By

Published : Jan 23, 2020, 6:00 PM IST

Updated : Jan 23, 2020, 8:09 PM IST

నాగోబా జాతర అంటే ఏమిటి..? ఎలా మొదలైంది..?

దేశ నలుమూలల నుంచి..

ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టే జాతరే నాగోబా. వందల ఏళ్లుగా అడవి బిడ్డల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న నాగోబా దేవతకు ప్రతీ ఏటా పుష్యమాసంలో వారం రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో జరిగే ఈ జాతరను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

80కి.మీ నడిచి వెళ్లి పవిత్ర జలాలతో తిరిగొస్తారు..

పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి నదిలో గల హస్తినమడుగు వాగు నుంచి పవిత్ర జలాలను మెస్రం వంశీయులు ప్రత్యేక కలశంలో తీసుకొస్తారు. 20మంది కొత్త కుండలతో కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ 80 కి.మీ నడిచి వెళ్లి ఈ పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఈ పవిత్ర గంగాజలం భక్తులపై చల్లడంతో పూజ ఆరంభమవుతుంది. తరతరాలుగా ఒకే వంశానికి చెందినవారు పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. మూడేళ్లకోసారి పూజారిని మాత్రమే మారుస్తారు.

నాగోబా జాతర కథ..

నాగోబా జాతరకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే క్రీ.శ 740 కాలంలో కేస్లాపూర్‌లో శేషసాయి ఆదివాసీ ఉండేవాడు. ఓసారి ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ప్రయత్నించగా.. ద్వారపాలకుడు అడ్డుకున్నాడట. చేసేదేమీ లేక శేషసాయి తిరుగు ప్రయాణంలో పొరపాటున నాగలోకం ద్వారం తాకుతాడు. ఆ విషయం తెలిసిన నాగరాజు కోపంతో రగిలిపోయి శేషసాయిని శిక్షించడానికి వచ్చాడట. ఆ సమయంలో శేషసాయికి ఎదురుపడిన ఓ వ్యక్తి ఏడు కడవలతో ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు 125 గ్రామాల మీదుగా నడుచుకుంటూ నాగదేవతకు సమర్పించాలని చెప్తాడు. శేషసాయి అలాగే చేస్తాడు. నాగరాజు శాంతించి.. ప్రతీ ఏటా ఇలాగే పూజలు నిర్వహించమని కోరుతాడు. అప్పటి నుంచి ఆ ఆచారం అలాగే కొనసాగుతూ వస్తోంది. శేషసాయి భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడని..ఆ స్థలమే నాగోబా జాతరగా ప్రసిద్ధికెక్కింది.

నిజాం కాలంనాటి దర్బార్

నాగోబా జాతర నిర్వహించే మెస్రం వంశీయులు వేలాదిగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ వంశస్థులు ఎంతమంది ఉన్నప్పటికీ వంట మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన 22 పొయ్యిల మీద మాత్రమే చేసుకోవాలి. ఇది వాళ్ల ఆచారం. జాతర ముగిసిన తర్వాత నిర్వహించే దర్బార్​కి ప్రత్యేక చరిత్ర ఉంది. నిజాం కాలంలో 1946లో ఈ దర్బార్ ప్రొఫెసర్ హైమన్​డార్ఫ్​ ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగిస్తున్నారు. ఈ దర్బార్​లో ఆదివాసీల సమస్యల మీద ఫిర్యాదులు స్వయంగా జిల్లా కలెక్టరే స్వీకరించి పరిష్కరిస్తారు.

ఇవీ చూడండి: నాగోబా జాతర: గంగాజలం కోసం కొండలు ఎక్కుతూ..

Last Updated : Jan 23, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details