ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌లో సాగు విధానం ప్రత్యేకమైంది. రాష్ట్రంలో ముందుగానే ఇక్కడ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభిస్తారు. జిల్లాలో 5.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు గుర్తించి ఆమేరకు ఎరువులు జిల్లాకు చేరాయి. రెండు రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతుల్లో హడావిడి మొదలైంది. విత్తనాలతో పాటు ఎరువులు తీసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
మరోవైపు వర్షాలు మరిన్ని కురవగానే విత్తనాలు పెట్టి ఎరువులు చల్లేలా భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సహకార సంఘాల ద్వారా ఊర్లోనే ఎరువులు తీసుకునే వీలున్నా.. అందుబాటులో ఉన్న నిల్వల విక్రయానికి అనుమతులు రాకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. దూర భారమైన వెళ్లి తెచ్చుకుందామంటే లాక్‌డౌన్‌తో ఇబ్బందులుపడుతున్నామని వాపోతున్నారు. రవాణా భారం తగ్గేలా సహకార సంఘాల ద్వారా ఊరిలోనే ఎరువులు పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు.