తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Problems: అష్టదిగ్భందనంలో అన్నదాత.. ప్రతికూల పరిస్థితులతో పరేషాన్‌

అన్నంపెట్టే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్‌ ఆరంభంలో అనుకూలంగా ఉందనుకున్న కాలం ఇప్పుడు ఏకదాటిగా కురుస్తున్న వానలతో ప్రతికూలంగా మారింది. పంటల దిగుబడి ఎలా ఉంటుందనే అయోమయం కర్షకులను ఆగం చేస్తోంది. దసర పండుగ నాటికి ఇంటికి చేరే పత్తి, సోయా పంటల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టిన పెట్టుబడి చేతికిరాకపోతే భవిష్యత్తు ఎలా మారుతుందోననే బెంగ రైతులను వెంటాడుతోంది.

farmers problems in kharif season in telangana
farmers problems in kharif season in telangana

By

Published : Oct 9, 2021, 4:48 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రతీ రైతును ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్‌ ఆరంభం నుంచి ఇప్పటిదాకా అష్టదిగ్భందంలో చిక్కుకున్న రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పంట వేసే సమయంలో కాలం అనుకూలంగా ఉండటం వల్ల రైతులు అప్పులు తెచ్చి మరీ... పెట్టుబడులు పెట్టారు. తీరా చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు ప్రతికూలంగా మారి.. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పెట్టుబడితో ప్రారంభం

ఖరీఫ్‌ ఆరంభం అంటే వేసవి దుక్కులతో వ్యవసాయం ప్రారంభమవుతుంది. దుక్కులతో పాటు చేలను చదనుచేయడం, తుక్కు ఏరడం, సేంద్రీయ ఎరువుల వాడకంతోనే పెట్టుబడి ప్రారంభమవుతుంది. ఒక్కో ట్రాక్టర్‌ సేంద్రీయ ఎరువుకు కనీసం రూ.2 వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. ఎకరాకు కనీసం మూడు ట్రాక్టర్ల ఎరువును పరిగణలోకి తీసుకుంటే రూ.6 వేలు చెల్లించాల్సి వస్తోంది. తరువాత 450 గ్రాముల పత్తి విత్తన సంచి ధర రూ. 750, రసాయనిక ఎరువులు, పిచికారి మందులు, కలుపుతీత, కూలీల ఖర్చు.. అన్నీ కలిపి ఎకరాకు సగటున రూ. 15 వేల పైచిలుకే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. రైతు, ఎద్దుల శ్రమ అధనం. ఈ పరిస్థితుల్లో పండితే పటేలు- లేదంటే పాలేరు అనేలా పరిస్థితి తయారైంది.

అధిక వర్షాలతో అనర్థం..

జిల్లా సగటు సాధారణ వర్షపాతం 992.8 మిమి కాగా.. మంగళవారం నాటికే 1566.1 మిమి వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 18 మండలాలకుగాను 12 మండలాల్లో అధిక వర్షం నమోదైంది. సోయా పంట కోత దశకు, పత్తిపంట పూత దశకు చేరుకున్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంట చేలల్లో మురుగునీరు చేరి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తేమ కారణంగా పంటల నాణ్యత తగ్గితే మార్కెట్లో మద్దతు ధర లభించని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా పంటల కొనుగోళ్ల సందర్భంగా వ్యాపారులు తేమశాతాన్ని తెరపైకి తెచ్చి మద్దతు ధరలో కోత విధించడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ధర ఎలా ఉంటుందనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.

దిగుబడి ప్రశ్నార్థకమే

సహజంగానైతే సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి, దిగుబడి వస్తుంది. ఈ ఏడాది అధిక వర్షాటతో దిగుబడిపై సందిగ్ధత ఏర్పడింది. జిల్లాలో నల్లరేగడి నేలల్లో సగటున ఎకరాకు 8నుంచి 10క్వింటాళ్లు, ఎర్రనేలల్లో 5 నుంచి 6 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. గత ఏడాది నల్లరేగడి నేలల్లో కేవలం 5 నుంచి 6 క్వింటాళ్లకే పరిమితమైంది. జూన్‌ రెండోవారంలో విత్తనాలు వేసని పంటలను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్‌ రెండోవారానికి 90 రోజుల వరకు మూడు నెలల కాలం పూర్తవుతుంది. అంటే కాత, పూత పూర్తయి పంట చేతికొస్తుంది. ఆ తరువాత రెండో పంట వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తొలి పంటలోనే కాత, పూత రాలిపోవడం వల్ల దిగుబడిపై ప్రశ్నార్థకంగా మారుతోంది. సగటున రెండు కింటాళ్ల దిగుబడి తగ్గినా రైతు చేసిన శ్రమ వర్షార్పణమైనట్లే.

బాహ్యకాయకుళ్లు

ఇప్పటికే గులాబీరంగు పురుగు రైతులను కలవరపరుస్తుందనుకుంటే.. వానలతో బాహ్యకాయకుళ్ల సమస్య ఆందోళన పెడుతోంది. అధిక వర్షాలతో పంట చేలల్లో మురుగు నీరు చేరుతోంది. ఫలితంగా పత్తి, సోయా మొక్కల్లో నేలకు ఆనుకొని ఉండే కిందికాయలన్నీ కుళ్లిపోతుండటం వల్ల కొత్త సమస్య వచ్చిపడింది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే పంటచేలల్లో సస్యరక్షణ పద్ధతులు చేపట్టాల్సి ఉంటుందనేది వ్యవసాయ శాస్త్రవేత్త డా. రాజేశఖర్‌ అభిప్రాయం. మురుగునీరు తొలగించడానికి, అవసరమైన మందుల పిచికారి కోసం ఎకరాకు అదనంగా రూ. 2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అంటే అధిక వర్షాల కారణంగా రైతులపై అధనపు భారం పడుతుంది. ఇప్పటికిప్పుడు వానలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎరువులు, పిచికారి మందులు వాడితే తప్ప.. బాహ్య కాయకుళ్ల సమస్యను అధిగమించడం కష్టమే అని డా. రాజశేఖర్‌ అభిప్రాయపడుతున్నారు.

పంట రుణాలేవీ..

జిల్లాలో పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకంగానే మారింది. ఈ ఏడాది రూ.1018.33 కోట్ల పంట రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కానీ.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ. 845 కోట్లే. ఖరీఫ్‌ ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడంలేదు. ఇచ్చిన రుణాల్లోనూ పుస్తక సర్దుబాట్లే ఎక్కువ. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధనల ప్రకారం వర్షాదారమైన పత్తి ఎకరాకు రూ.38వేలు, నీటి వసతి కలిగిన పత్తికి రూ.46 వేల చొప్పున రుణాలు ఇవ్వాలి. సోయా పంటకు రూ.24 వేలు, జొన్న, కంది, మినుము పంటలకైతే ఎకరాకు రూ.18 వేలు ఇవ్వాలనేది నిబంధన. పాత రుణాలనే తిరిగి రైతులు చెల్లించినట్లుగా చూపించి కొంత రుణం ఎక్కువగా చేసి ఇవ్వడంతోనే బ్యాంకర్లు పనికానిచ్చే విధానం కొనసాగుతోంది.

వడ్ఢీ రైతు మెడపై కత్తి..

జిల్లాలో ప్రైవేటు వడ్ఢీ వ్యాపారం రైతు మెడపై కత్తిలా మారింది. సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల గత్యతంతరంలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వడ్ఢీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో దాదాపుగా లక్షా 40 వేల మంది రైతులుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారిని ఆశ్రయించక తప్పడంలేదు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రైవేటు పంట రుణాలు తీసుకునే ప్రతి రైతు రూ. 100కు 25 చొప్పున వడ్ఢించే విధానం అనధికారికంగా అమలవుతోంది. పైగా దీనికి ఓ నిర్ధిష్టమైన సమయమంటూ లేదు. ఆగస్టు చివరివారంలో రుణం తీసుకొని అక్టోబర్‌లో చెల్లించినప్పటికీ అంతే వడ్ఢీ చెల్లించాలనేది నిబంధన. దళారుల దగ్గర డబ్పులతోపాటు ఎరువులు, క్రిమిసంహరక మందులు అప్పు కింద కొనుగోలుచేసిన అంతే వడ్ఢీ చెల్లించడంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

అమలుకాని రుణమాఫీ..

శాసనసభ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ రైతుల జీవితాలతో దోబూచులాడుతోంది. జిల్లాలో రైతుబందు లెక్కల ప్రకారం 147026 మంది రైతులుంటే దాదాపుగా లక్షా 10 వేల వరకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్నట్లు ప్రాథమిక లెక్క. వీరిలో 75 వేల నుంచి 80 వేల వరకు రూ.లక్షపైబడి అప్పుతీసుకున్నవారికి ఇప్పటిదాకా నయాపైసా మాఫీ వర్థించలేదు. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు కావస్తున్నా.. రూ.లక్ష రుణమాఫీ ఊసేలేదు. జిల్లాలో రూ.50 వేల వరకు అప్పుతీసుకుంటే... దాదాపుగా 15 వేల మందికి కాస్త ఉపశమనం లభించింది. మాఫీ వస్తుందనే ఆశలో ఉన్న రైతులకు.. వడ్ఢీభారం పెరగడమే కాకుండా కొత్త రుణాలు పొందలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా రైతులంటేనే బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి వెనకంజవేసే పరిస్థితి ఏర్పడింది.

భరోసాలేని బతుకులు

అన్నింటిని దిగమింగుకొని చేతికొచ్చే పంటను మార్కెట్లోకి తీసుకొస్తే సరైన మద్ధతు ధర లభిస్తుందనే భరోసా కనిపించడంలేదు. గతఏడాది పత్తి క్వింటాకు మద్ధతు ధర రూ.5825 ఉంటే ఈ ఏడాది 6025కి పెరిగింది. సోయా మద్దతు ధర రూ. 3880 నుంచి రూ. 3950కి పెరిగింది. అంటే పత్తి మద్ధతు ధర రూ.200 పెరిగితే, సోయా ధర కేవం రూ. 70 పెరిగింది. పోనీ మార్కెట్లో మద్ధతు ధర లబిస్తుందా ? అంటే అదీ లేదు. ప్రతిసారి తేమ, నాణ్యత పేరిట కోత విధించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో రైతుల బతుకు భరోసాలేని భవితగా మారుతోంది. క్లిష్టమైన ఈ ఏడాదైనా రైతులకు అండగా ఉంటారా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details