Special Story on 1981 Indravelli Incident: ఉత్తర తెలంగాణలో వామపక్ష ఉద్యమాల్లో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉంది. పోరాటాల అనుభవాల్లోంచే ఇంద్రవెల్లి సభ పురుడుపోసుకుంది. పందొమ్మిదో దశకంలో బ్రిటీష్ పాలకులతో పాటు నైజాం ప్రభువు విధానాలను.. వ్యతిరేకించినందుకు రాంజీగోండ్ సహా వెయ్యి మందిని నిర్మల్ కేంద్రంగా మర్రిచెట్టుకు ఉరి తీయడంతోనే వెయ్యి ఉరుల మర్రి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. కానీ అక్కడితో పోరాటం ఆగిపోలేదు.
మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రకెక్కిన ఇంద్రవెల్లి: 1940 ప్రాంతంలో జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా కుమురంభీం జరిపిన ఆదివాసీ స్వయం ప్రతిపత్తి పోరాటం.. అజరామర కీర్తిని సంపాదించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నాయకత్వానికి ప్రత్యేక నినాదంగా నిలిచింది. తర్వాత 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లి వేదికగా.. భూమి, భుక్తి, విముక్తి పేరిట అప్పటి రైతు కూలీ సంఘం తలపెట్టిన సభ పోలీసు కాల్పులకు దారితీసింది. మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రకెక్కింది. ప్రతి నలభై ఏళ్లకోసారి జరిగిన పోరాటం వెనుక.. భూ సమస్యనే ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది.
ఐదేళ్ల కిందట ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగానే ఆదిలాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆదివాసీ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులు దాటి దిల్లీకి చేరింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడుభూముల సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలకు ఇంద్రవెల్లి పోరాటం ప్రేరణగా నిలుస్తోంది. గిరిజనులకు పోరుబాట చూపిస్తోంది.