Govt Land Kabza Issue in Adilabad : ఆదిలాబాద్ పట్టణాన్ని ఆనుకొని 241 సర్వేనంబర్‌లో... 2005లో ఏర్పడిన జీఎస్ ఎస్టేట్ లేఅవుట్ పరిధిలోకి వచ్చే 5 ఎకరాల మున్సిపాల్టీ స్థలమిది. గృహ, వాణిజ్య అవసరాలకు పోగా మిగిలిన స్థలాన్ని... రోడ్లు వేయడానికి పురపాలక సంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. 5 ఎకరాలతో 200 అడుగుల రింగు రోడ్డు, దానికి ఇరువైపుల 40 అడుగుల చొప్పున.. సర్వీసు రోడ్డు వేయాలి. ఈ మేరకు జీఎస్ ఎస్టేట్ నిర్వహకులు బల్దియాకు గిప్టు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుత ధర ఎకరాకు కోటి రూపాయల చొప్పున పలుకుతోంది. 5 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కొట్టేసేందుకు పన్నాగం పన్నారు.
అప్పుల ఊబిలో చిక్కుకున్న లేఅవుట్ నిర్వహకులు... రింగ్ రోడ్డు కోసం కేటాయించిన 5 ఎకరాలను తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుతూ 2009 నుంచి పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ.. మున్సిపల్ కౌన్సిల్ అంగీకరించలేదు. ఆ తరువాత అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం సైతం ఫలించలేదు. అప్పట్లో పురపాలక అధికారులు కుదరదు అనడంతో కుట్రకు తెరలేపారు. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులతో కలిసి 2015లో తమపేరిట రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇతరుల పేరిట మార్చగా... వారిలో ఒకరిద్దరు 35.20 లక్షలకు ఓ ప్లాటు... 52.60 లక్షలకు మరో ప్లాట్లను ఇటీవల విక్రయించారు. దీంతో అక్రమ దందా బయటపడింది.
'మున్సిపాలిటీ ఆస్తి ఇది. 280ఫీట్లు.. దాదాపు ఐదు ఎకరాలు ఉంటుంది. దానిని వీళ్లు అమ్ముతున్నారంటే ఇంత పెద్ద ఆదిలాబాద్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్‌లో హైవే పక్కకు ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే మున్సిపాలిటీ భూమిని అమ్ముతుంటే అధికారులు కాపాడలేకపోతున్నారంటే పరిస్థితి గోరంగా ఉన్నది.'-ప్రకాశ్, స్థానికుడు, జీఎస్‌ఎస్టేట్