తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్దుబాట్లను పట్టించుకోని ఉపాధ్యాయులు.. విద్యార్థులకు తప్పని పాట్లు

Teacher adjustment process in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యాశాఖ చేసిన ఉత్తర్వులను కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెట్టడంతో పాఠాలు చెప్పే వారులేక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేక.. ఆచార్యులు ఉన్న చోట విద్యార్థులు లేక గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Teacher adjustment process in Adilabad
Teacher adjustment process in Adilabad

By

Published : Oct 17, 2022, 10:51 PM IST

విద్యాశాఖ ఉత్తర్వులతో ఆ జిల్లాలో ఉపాధ్యాయులు గందరగోళం.. విద్యార్థులకు తప్పని పాట్లు

Teacher adjustment process in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో సర్దుబాటు పేరిట జిల్లా విద్యాశాఖ చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయులు ఖాతరు చెయ్యటం లేదు. జిల్లా వ్యాప్తంగా 98 మంది ఉపాధ్యాయులను విద్యార్థులు అధికంగా ఉన్నచోటుకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. అట్టి ఉత్తర్వులను పట్టించుకోకుండా విద్యార్థులు లేనిచోటనే విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఎన్​జీఓ పాఠశాల. 158 మంది విద్యార్థులు ఉన్న ఈ విద్యాలయానికి రోజూ వచ్చే విద్యార్థుల సంఖ్య 50 దాటదు. అయితే ఇంత తక్కువగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలకు ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం పదకొండు. వీరి వేతనాలకు సరాసరి ప్రభుత్వం చెల్లించే మొత్తం రూ.6 లక్షలకు పైమాటే.

ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని హమాలీవాడ పాఠశాల పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఐదు తరగతులు కలిపి 162 మంది విద్యార్థులు ఉంటే పాఠాలు చెప్పేది మాత్రం ఒకే ఒక్క టీచరమ్మ. ఇక్కడికి వచ్చేవారంతా కూలీనాలీ చేసుకునే కుటుంబాల పిల్లలు కావడంతో నిత్యం బడి నిండుగా కనిపిస్తుంది. వచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పే సంగతి అటుంచితే.. వారిని పర్యవేక్షించడమే ఈ టీచరమ్మకి తలకు మించిన భారమవుతోంది. కొన్నిసార్లు విద్యాకమిటీ ఛైర్‌పర్సన్లు సైతం పాఠాలు బోధించాల్సి వస్తుంది. సర్దుబాటు కింద ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించినా వారు బడివైపు కన్నెత్తి చూడటం లేదని టీచరు వాపోతుండగా.. అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోతోందని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 552 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 98 మందిని సర్దుబాటు చేసినా వారిలో చాలా మంది కేటాయించిన పాఠశాలలకు వెళ్లడం లేదు. దానికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉపాధ్యాయులకు వరంగా మారింది. దీంతో ఎలాగైనా ఉపాధ్యాయులను పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్దుబాటు ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details