రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాతావరణమంతా వేరుగానే ఉంటోంది. వేసవిలో భరించలేని ఎండలు కాయటం, వర్షాకాలంలో భారీ వర్షాలు కురవటం, శీతాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికిపడి పోవటం సహజమే. కానీ ఈ ఏడాది రాత్రుల్లో చలితీవ్రత ఉంటే... పగలు భానుడి ఉగ్రరూపం జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్, ఇంద్రవెల్లి, కెరమెరి, ఆసిఫాబాద్, బెజ్జూరులాంటి మండలాల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో భరించలేని ఉక్కపోతతో జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వేడి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, శీతలపానీయాలకు డిమాండ్ పెరిగితే చలితీవ్రత ఎక్కువ ఉండటంతో ఇంకా ఉన్ని దుస్తుల కొనుగోళ్లు యధావిధిగానే కొనసాగుతుండటం జిల్లాలోని భిన్నమైన వాతావరణ స్థితిగతులకు అద్ధం పడుతుంది.
ఉత్తరాది నుంచి పగలంతా వేడిగాలులు వస్తుంటే... రాత్రుల్లో చలిగాలు వీస్తుండటంతోనే భిన్నమైన పరిస్థితులకు కారణమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పెన్‌గంగ, గోదావరి, ప్రాణహిత, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో గతానికి భిన్నంగా వాతావరణం స్పష్టంగా ఉంటోంది.