CS Respond on Gurukulam Students: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు ప్రభుత్వం 34వేల దుప్పట్లు పంపించింది. చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనాడు, ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనాలపై స్పందించింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు, మంకీక్యాప్‌లు కొనుగోలు చేసేందుకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆర్డరును ఆమోదించారు. ప్రభుత్వం వెంటనే 34వేల దుప్పట్లను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఇప్పటికే దుప్పట్లను ఆయా జిల్లాలకు రవాణా చేసిన గిరిజన సంక్షేమశాఖ బుధవారం రాత్రికే విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించింది.
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రూ.ఏడు కోట్లతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసేందుకు గత ఏడాది ఆ శాఖ అంచనాలు రూపొందించింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటం, వసతి గృహాలు తెరవకపోవడంతో కొనుగోలు చేయలేకపోయింది. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాలని సంక్షేమశాఖ నిర్ణయించింది. మరో 15 రోజుల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తామని చెబుతోంది.