ఇప్పటి వరకు విత్తనాల అమ్మకాలు, తదితర వాటి ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేవారు. దీనివల్ల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు ఏర్పడేవి. తాజాగా ప్రభుత్వం రైతుల వారీగా సాగు విస్తీర్ణం అంతర్జాలంలో నమోదు చేయాలని ఆదేశించడంతో సాగుకు సంబంధించిన లెక్కలు తేల్చేపనిలో వ్యవసాయ సిబ్బంది తలమునకలయ్యారు. పంట సాగు నమోదు ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.
అంతర్జాలంలో వివరాల నమోదు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటల సాగు, వ్యవసాయ స్థితిగతులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇచ్చినా.. రెవెన్యూ, వ్యవసాయ, ముఖ్య ప్రణాళికాధికారి శాఖల మధ్య ఉన్న సాగు భూములు, దిగుబడులు, పంటల సాగు తదితర వివరాల్లో భారీ తేడాలుంటున్నాయి. గత సర్వేలతో సంబంధం లేకుండా ఈ వానాకాలంలో రైతుల వారీగా పంటల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు.
నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లు..
జిల్లాల వారీగా చేపట్టనున్న సర్వేతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో సాగు లెక్క పక్కాగా తేలనుంది. రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతో పాటు, వేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంటలు, నీటి వసతి, చరవాణి నంబర్, చివరలో రైతు సంతకం తీసుకోనున్నారు. పంట సాగు చేసే ప్రతి రైతు తమ వివరాలు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నా.. వివరాల లెక్క తేలకపోవడంతో గత సీజన్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు లేకున్నా అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఆన్‌లైన్‌లో పేర్లు, సాగు చేసిన పంట తదితర వివరాలు ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.