ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 9 లక్షల 17వేల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ తేల్చింది. దాదాపుగా కోటి 17లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనావేసింది. తేమశాతం 8 నుంచి 12 ఉంటే పత్తికొనుగోళ్లకు భారత పత్తి సంస్థ-సీసీఐ సైతం ముందుకొచ్చింది. ఈ నెల 19నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని... మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశం నిర్ణయించింది. కానీ హైదరాబాద్‌లో అకాలవర్షాలు రావడంతో రైతుల వివరాలను ఆన్‌లైన్ చేసే ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. ఫలితంగా కొనుగోళ్లను వాయిదా వేయాల్సివచ్చింది.
చేతికొచ్చిన పత్తిని సీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఆరబెట్టి సిద్ధంగా ఉంచినప్పటికీ హైదరాబాద్‌లో వర్షాల పేరిట అధికారయంత్రాంగం ఏకపక్షంగా కొనుగోళ్లను వాయిదావేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబర్‌లోనే రైతుల వివరాలను కంప్యూటరీకరణను పూర్తిచేయాల్సి ఉంది. కానీ మార్కెటింగ్ నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా కొనుగోళ్లలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనికి తోడు ఆదిలాబాద్‌లో శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ సమావేశంలో.... దసరా తరువాతనే కొనుగోళ్లు చేయాలని నేతలు నిర్ణయించడం రైతుల్లో మరింత ఆందోళన పెంచుతోంది.