పట్టణాలు, నగరాల్లో కొవిడ్ టీకా కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతుంటే ఆదిలాబాద్ ఏజెన్సీ పరిధిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో సరిపడా డోసులు ఉన్నా.. ఎవరూ ముందుకురావడం లేదు. మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో రోజుకు 100 నుంచి 150 డోసులు అందించాలని నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ రోజుకు పదిమంది కూడా వేసుకోవడం లేదు. అవగాహన లేక కొందరు, అపోహలతో మరికొందరు టీకాలు స్వీకరించడం లేదు. ఈ నెల 13 వరకున ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో కేవలం 15 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తికావడం గమనార్హం.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ వ్యాక్సిన్ కోసం వచ్చేవారి సంఖ్య పదికి మించడం లేదని వైద్యసిబ్బంది అంటున్నారు. ఇంద్రవెల్లి పీహెచ్‌సీ పరిధిలో 20,663 మంది టీకాలు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు 3,171 మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరం పీహెచ్‌సీ పరిధిలో 15,137 మంది ఉండగా, ఇప్పటి వరకు 1,120 మంది మాత్రమే టీకాలు తీసుకున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.